బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతెలుగు సాహిత్య విలువ అమూల్యం

1 గంట క్రితం

తెలుగు సాహిత్య విలువ అమూల్యం
- ఎస్‌ఆర్‌ఎం సాహిత్యోత్సవ సభలో తేజస్వి పొడపాటి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎస్‌ఆర్‌ఎం సాహిత్యోత్సవ సభలో తేజస్వి పొడపాటి

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే శక్తి ఉన్న తెలుగు భాష, సాహిత్యం విలువ అమూల్యమని, వెలకట్టజాలమని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. స్థానిక ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అమరావతి సాహిత్యోత్సవ ప్రారంభ సభలో ఆమె మాట్లాడారు. వర్సిటీ విసి ప్రొఫెసర్‌ సిహెచ్ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ యుగంలో విద్యార్థులు ‘అక్షరం’ విలువను విస్మరిస్తున్నారని, సాహిత్య మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే అక్షరాన్ని ఆరాధించాలని తేజస్వి ఈ సందర్భంగా సూచించారు. విదేశీ భాషలపై ఆసక్తి ఉన్నా మాతృభాషను విస్మరించరాదన్నారు. తెలుగు భాషా వికాసం, సాహిత్య విలువలను పెంచడంలో భాగంగా విజయవాడలో ఈ నెల 11 నుంచి 20 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పది మందికి పైగా ముఖ్యమంత్రులు హాజరుకానున్నారని వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంతో పాటు సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. విసి ప్రో. సతీష్‌ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల భాషలు, సాహిత్యాలను పరిమళింపజేస్తున్న కవులు, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడమే అమరావతి సాహిత్య ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపితో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు హాజరయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్