నిర్వాసితుల సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యం
మంత్రులు రామానాయుడు, డోలా బాలవీరాంజనేయ స్వామి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మార్కాపురం ప్రాంత ప్రజల సాగు, తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు పనులను తుది దశకు తీసుకొచ్చామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ ప్రాజెక్టు ఎంతో కీలకమన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రజలకు మేలు జరగాలన్న ముఖ్యమంత్రి పట్టుదలతోనే ప్రాజెక్టు తుది దశకు చేరిందన్నారు. హెడ్ రెగ్యులేటర్, సిసి వాల్స్, వింగ్స్‌తో పాటు కృష్ణా టన్నెల్ నుంచి నీటి ఛానెల్ వచ్చేలా పనులు చేపట్టామని వివరించారు. మొత్తం 7 వేల మీటర్ల లైనింగ్‌లో 6,919 మీటర్లు పూర్తయ్యాయని, మిగిలిన 81 మీటర్ల పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఇంకా 1,900 మీటర్ల టన్నెల్, 21 మీటర్ల ఫీల్డర్ కెనాల్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఐదు గ్యాండ్రిన్లతో 6,900 మీటర్ల లైనింగ్ పనులు పూర్తయ్యాయన్నారు. 1,600 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ప్రాంతంలో కేవలం 10 క్యూసెక్కుల నీరు వచ్చినా మునిగిపోయే పరిస్థితులు ఉండేవని వివరించారు.
ఈ ఏడాదే పూర్తి చేస్తాం : డోలా
వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదే పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు నెల్లూరు, కడప జిల్లాలకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని చెప్పారు. ఈ నెలాఖరులో నల్లమలసాగర్‌లో నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన మిగిలిన రూ.400 కోట్లను కూడా త్వరలో అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.
మార్కాపురం రూపురేఖలు మారుస్తాం : నాగార్జునరెడ్డి
మార్కాపురం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి తెలిపారు. 30 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల త్వరలో సాకారం కానుందని చెప్పారు. మార్కాపురాన్ని ‘చంద్రన్న మార్కాపురం’గా నామకరణం చేయాలని 118 మంది ఎమ్మెల్యేలు.. స్పీకరుకు వినతిపత్రాన్ని అందించారని తెలిపారు.








కామెంట్‌లు (0)