గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతమ్మినేని కుటుంబానికి ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్

2 గంటల క్రితం

ap-high-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి : మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుటుంబానికి ముందస్తు బెయిల్‌ అంశంపై తీర్పును రాష్ట హైకోర్టు రిజర్వ్‌ ‌చేసింది. భూయజమాని బతికే ఉండగా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, మరో మహిళను యజమాని కుమార్తెగా చూపిస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందిన అనంతరం విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో వైసిపి నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (ఏ-6), ఆయన భార్య వాణి (ఏ-7), కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు (ఏ-5) కీలక పాత్ర పోషించారని రాష్ట్ర తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. నకిలీ పత్రాలతో ఆస్తి రిజిస్ట్రేషన్ పిటిషనర్ల సమక్షంలోనే జరిగిందని, వారి ఉద్యోగుల వాంగ్మూలాలతో పాటు రూ.72 లక్షలు చెల్లించినట్లు పత్రాల్లో నమోదైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గోల్డ్ లోన్ రూపంలో తీసుకున్న మొత్తం రూ.20 లక్షలు మాత్రమేనని, ఆ సొమ్మును కూడా ఇతర అవసరాలకు వినియోగించినట్లు బ్యాంకు ఖాతాల ద్వారా తేలిందన్నారు. పిటిషనర్లు పరారీలో ఉండటంతో అరెస్టు చేయలేకపోయామని, దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ముందస్తు బెయిల్ నిరాకరించాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి. రఘు వాదనలు వినిపిస్తూ, నకిలీ ధ్రువపత్రాల సృష్టితో తమకు సంబంధం లేదని, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న సొమ్ముతోనే ఆస్తి కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటికే కొందరు నిందితులకు బెయిల్ లభించిందని, దర్యాప్తుకు సహకరిస్తామని పేర్కొంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఫిర్యాదుదారుడు జయకిషోర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదిస్తూ, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్దేశపూర్వకంగా ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగిందని, ఇది సమాజానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులకు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని వాదించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ నెల 27న వెల్లడిస్తామని ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్