- ఉద్రిక్తత తలెత్తినా బందోబస్తులో సిఐ ఒక్కరే
- కొద్దిసేపటికి వెళ్లిపోయిన విద్యార్థులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్యాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా జగన్ ఇంటిముందు ధర్నాకు దిగారు. ప్రధాన గేటు ముందుకు వచ్చి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ పత్రికలో రాసిన వార్తల వల్ల తమకు అన్యాయం జరిగిందని, దానికి జగనే కారణమని పేర్కొన్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వైసిపి అనుబంధాల యువత కూడా అక్కడకు చేరుకుంటుండంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వైసిపి కార్యకర్తలు అక్కడే ఉన్నప్పటికీ ఎవరినీ ఏమీ అనలేదు. నిరసన వ్యక్తం చేసిన వైద్యులు కొద్దిసేపటికి ప్రదర్శన చేసుకుంటూ వెళ్లిపోయారు. కేవలం జగన్ ప్రకటన వల్లే ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఓ యువకుడు మీరు పత్రికను తిట్టాలనుకుంటే అక్కడకు వెళ్లాలిగానీ ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో పరస్పరవాదులాట జరిగింది. అక్కడ ఉన్న తాడేపల్లి సిఐ వారికి సర్థిచెప్పి పంపించేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాయకులు పి.రమేష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను మెరిట్లో తీసుకునేందుకు జిఓ నెంబరు 52 తీసుకొచ్చిందని అన్నారు. దీనిపై జగన్, ఆయన అనుకూల పత్రికలో వార్తలు రాయడంతో ప్రభుత్వం జిఓను వెనక్కు తీసుకుందని పేర్కొన్నారు. దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని వివరించారు. 2018లో విఎఎస్ నియామకాలు జరిగాయని, అనంతరం ఒక్కరిని కూడా నియమించలేదని వివరించారు. వైసిపి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని అన్నారు. జి.రమాదేవి మాట్లాడుతూ ఎపిపిఎస్‌సి కింద 164 పోస్టులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే వైసిపి నాయకుల వల్ల అది వెనక్కు పోయిందని తెలిపారు. తామందరం కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు చేస్తున్నామని, ఇక ముందు ఉద్యోగం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. డాక్టర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ వెటర్నరీ డాక్టర్లకు వైసిపి నాయకులు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి తెలుగుయువత కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. కొద్దిసేపటికి వైసిపి కార్యాలయానికి చేరుకునేవారి సంఖ్య కూడా పెరగడంతో పరస్పర ఘర్షణ జరుగుతుందనే ఆందోళన నెలకొంది. నిరసన అనంతరం విద్యార్థులు అక్కడ నుండి ప్రదర్శన చేసుకుంటూ భరతమాత విగ్రహం వైపు వెళ్లిపోయారు.
కనిపించని పోలీసులు
ప్రతిపక్ష నేత ఇంటిముందు నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ పోలీసులు అక్కడ కనిపించలేదు. తాడేపల్లి సిఐ, స్పెషల్ బ్రాంచ్ అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారు. మరొక కానిస్టేబుల్ విధుల్లో కనిపించారు. సహజంగా ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో పరస్పర ఘర్షణకు దిగితే ఏమి జరుగుతుందో తెలియదు. అయినా పోలీసులు అక్కడ భద్రత ఎందుకు కల్పించలేదనేది పలు విమర్శలకు దారితీసింది.








కామెంట్‌లు (0)