- రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న నోబిడ్, లో బిడ్ సమస్యను, పొగాకు కనీస సగటు ధర రూ.300 ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య కోరారు. మంగళవారం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం రూ.1000 కోట్ల పొగాకు రైతుల సమాఖ్యకు ఇచ్చి ప్రభుత్వమే వర్జీనియా పొగాకు కొనుగోలు చేయాలని కోరారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో పొగాకు రైతులు పండించిన పొగాకు పంటకు కంపెనీలు న్యాయమైన ధర ఇవ్వడం లేదన్నారు. కనీస సగటు ధర కిలో రూ.300 కల్పిస్తేనే గిట్టుబాటు అవుతోందని, లేకుంటే ఒక్కొక్క బ్యారన్ వేసిన రైతుకు కనీసం ఐదు లక్షల నష్టం వాటిల్లోందన్నారు. ముఖ్యమంత్రి కనీస ధర రూ. 200 తక్కువ లేకుండా కొనాలని చెప్పినా పొగాకు కంపెనీలు మాటను లెక్కచేయకుండా కిలో రూ.150, రూ.140 కు మించి కొనుగోలు చేయని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం పొగాకు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడం, పొగాకు కంపెనీల సిండికేట్ ను నిరోధించడం చేయాలన్నారు. తక్కువ ధర ఇచ్చి రైతులను మోసం చేస్తున్న కంపెనీల లైసెన్సులను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేయడం ఒకటే పరిష్కార మార్గమని సూచించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల ప్రయోజనాలు కాపాడాలని లేనిపక్షంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారన్నారు.








కామెంట్‌లు (0)