196 రోజుల్లోనే ఐదు కోట్ల టన్నుల సరుకు నిర్వహణ
ప్రజాశక్తి -ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 196 రోజుల్లోనే ఐదు కోట్ల మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించిందని పోర్టు కార్యదర్శి ఎం శంకర్బాబు తెలిపారు. ఈ నెల 13వ తేదీ నాటికి మొత్తం 5,00,07,081 టన్నుల సరుకును నిర్వహించిందన్నారు. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల టన్నుల సరుకు నిర్వహణ మైలురాయిని చేరుకోవడానికి 213 రోజులు పట్టగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో 224 రోజులు పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోలిస్తే 17 రోజులు, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 28 రోజుల ముందుగానే ఈ ఘనతను సాధించడం విశేషం. ఈ ఏడాది జూన్ 14 నాటికి 76 రోజుల్లో రెండు కోట్ల టన్నులు, జులై 23 నాటికి 114 రోజుల్లో మూడు కోట్ల టన్నులు, సెప్టెంబరు మూడు నాటికి 156 రోజుల్లో నాలుగు కోట్ల టన్నుల సరుకు నిర్వహణను పూర్తి చేసింది. అక్టోబరు ఏడు నాటికి 180 రోజుల్లో నాలుగున్నర కోట్ల టన్నుల సరుకును నిర్వహించి, ఆరు రోజుల వ్యవధిలోనే మరో కీలక మైలురాయిని అధిగమించింది.
భారీ నౌకలకు బెర్తింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు వివిధ రకాల సరుకుల దిగుమతి, అన్లోడింగ్లోనూ పోర్టు పలు విజయాలను నమోదు చేసింది. సెప్టెంబరు ఒకటిన బెల్జియం జెండాతో వచ్చిన 339.50 మీటర్ల పొడవు, 60.04 మీటర్ల వెడల్పు కలిగిన ‘అట్రెబేట్స్’ నౌకకు ప్రత్యేక ముడి చమురు రవాణా బెర్త్ వద్ద సదుపాయం కల్పించింది. ఈ బెర్త్ వద్ద సదుపాయం పొందిన అతిపెద్ద ముడి చమురు రవాణా నౌకగా ఇది నిలిచింది. ఆగస్టు 11వ తేదీన ఈక్యూ-1ఏ బెర్త్ వద్ద ‘ఎంవి కోనా ఎక్స్ప్లోరర్’ నౌక నుంచి 36,800 టన్నుల సున్నపురాయిని, జూన్ ఒకటిన ‘ఎంవి గువో హాయ్ లియన్ 818’ నౌక నుంచి 36,010 టన్నుల మాంగనీస్ ఖనిజాన్ని దిగుమతి చేసుకుంది. ముడి చమురు అన్లోడింగ్లోనూ పోర్టు రికార్డులు సాధించింది. 2026 జూన్లో అత్యధికంగా 21,58,712 టన్నుల ముడి చమురును అన్లోడ్ చేయగా, మేలో 18,58,169 టన్నుల ముడి చమురును అన్లోడ్ చేసింది. జూన్ ఐదున 292 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు కలిగిన ‘ఎంవి గ్రేసియస్’ నౌకకు ఈక్యూ-1 బెర్త్ వద్ద సదుపాయం కల్పించింది. ఈ పరిమాణంలో ఉన్న నౌకకు ఆ బెర్త్ వద్ద సదుపాయం కల్పించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 25న 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు కలిగిన ‘ఎంవి రెజీనా ఓల్డెన్డార్ఫ్’ నౌకకు కూడా బెర్తింగ్ సదుపాయం కల్పించింది. ఈ విజయానికి కృషి చేసిన ట్రాఫిక్ విభాగం అధికారులు, సిబ్బందిని పోర్టు చైర్మన్ జెఎస్. బింద్రా, ఉపాధ్యక్షులు రోష్ని అపరాంజి కోరాటి అభినందించారు. ఇదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేసి 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పది కోట్ల మెట్రిక్ టన్నుల సరుకు నిర్వహణ లక్ష్యాన్ని సాధించాలని సిబ్బందికి సూచించారు.








కామెంట్లు (0)