- ఫారం-6, 8 దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంలో జాప్యం కొనసాగుతోంది. సెప్టెంబరు 9 నాటికి ఫారం-6కు సంబంధించి 2.56 లక్షలు, ఫారం-8కు 1.51 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫారం-7కు సంబంధించి మరో 9,119 దరఖాస్తులు పరిష్కారం కావాల్సి ఉంది. ఫారం-6లో వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 23,915 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, నెల్లూరులో 20,380, తిరుపతిలో 13,428, ప్రకాశంలో 13,296, నంద్యాలలో 12,406 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బిఎల్‌ఒతో కాల్ బుక్ చేసుకునే అంశంలో 473 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 44.28 లక్షల నోటీసులు జారీ చేయగా, సెప్టెంబరు 9 నాటికి కేవలం ఎనిమిది నోటీసులు మాత్రమే పంపిణీ కావాల్సి ఉంది. రాయదుర్గం, రాప్తాడు, మార్కాపురం నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పంపిణీ చేసిన 44.28 లక్షల నోటీసులకు 39.58 లక్షల కేసులపై విచారణ పూర్తయింది. ఇది 90.47 శాతంగా నమోదైంది. అల్లూరి సీతారామరాజు, కర్నూలు, చిత్తూరు, పశ్చిమగోదావరి, మార్కాపురం, నంద్యాల జిల్లాలు విచారణలో మెరుగైన పనితీరు కనబరిచాయి. పల్నాడులో 19.53 శాతం, అనంతపురంలో 18.45, తిరుపతిలో 17.59, వైఎస్సార్‌లో 17.21, ప్రకాశంలో 16.48 శాతం మాత్రమే విచారణ పూర్తయింది. ఓటర్ల ఫొటోల నాణ్యత పరిశీలనలోనూ భారీగా పెండింగ్ ఉంది. మొత్తం 2.83 కోట్ల ఫొటోలు అప్‌డేట్ కాగా, బిఎల్‌ఒ స్థాయిలో 1.51 కోట్ల ఫొటోలకు ఆమోదం లభించింది. దీంతో 46.37 శాతం పెండింగ్‌లో ఉన్నాయి. ఫొటోల నాణ్యత పరిశీలనలో పోలవరం, తూర్పుగోదావరి, బాపట్ల జిల్లాలు మెరుగైన పనితీరు కనబరుస్తుండగా, అన్నమయ్య, ప్రకాశం, విశాఖపట్నం, ఎన్‌టిఆర్, పార్వతీపురం మన్యం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఇతర కేటగిరీకి చెందిన 3.27 కోట్ల మంది ఓటర్లలో 1.55 కోట్ల మందిని ఫైనల్ జాబితా కు సిద్దం చేశారు. ఇంకా 52.55 శాతం మంది పెండింగ్‌లో ఉన్నారు. ఈ ప్రక్రియలో బాపట్ల, చిత్తూరు, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం జిల్లాలు ముందంజలో ఉండగా, గుంటూరు, ఎన్ టిఆర్, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు వెనుకబడ్డాయి. ఫారం-6, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారం, ఫొటోల నాణ్యత పరిశీలన, ఇతర కేటగిరీ ఓటర్ల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరముంది.








కామెంట్‌లు (0)