జలవనరులశాఖ మంత్రి నిమ్మల
నిర్వాసితులకు రూ.200 కోట్లు పంపిణీ చేసిన సిఎం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలిగొండ ద్వారా వెలుగులు నింపబోతున్నామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం రూ.200 కోట్ల పరిహారం పంపిణీ చేశారు. చెక్కును బాధితులకు సిఎం అందజేశారు. అనంతరం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.900 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఐదేళ్ల పదవీకాలంలో నిర్వాసితులకు జగన్ ఒక్కపైసా కూడా చెల్లించకుండా మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2,557 మంది నిర్వాసితులకు రూ.318 కోట్లు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. బుధవారం నాడు 1,600 మంది నిర్వాసితులకు రూ.200 కోట్లు ఇచ్చామని చెప్పారు. మిగిలిన మొత్తాన్ని వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో పాటు చెల్లిస్తామని చెప్పారు. ఈ రెండేళ్లలోనే రూ.3 వేల కోట్లు వెచ్చించి వెలిగొండ కల సాకారం చేసినందుకు సిఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిర్వాసితుల కోసం ఏర్పాటుచేసిన ఏడు కాలనీల్లో నాలుగు పూర్తయ్యాయన్నారు. మిగిలిన మూడు కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా వెలిగొండ శంకుస్థాపన జరిగిందన్నారు. అదే చంద్రబాబు నేడు కూటమి ప్రభుత్వ అధినేతగా ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి ఈ నెలలోనే నీరు ఇవ్వడం ఒక చరిత్ర అని అన్నారు. గతంలో వెలిగొండ పూర్తికాకుండానే ప్రారంభోత్సవం చేసి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేసిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు. 2024లో జలవనరులశాఖ సమీక్షలో 2026 ఆగస్టు కల్లా వెలిగొండను పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారని, దానికనుగుణంగా ఈ రెండేళ్లలో, హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి సిసి వాల్స్, వింగ్స్‌ను 2026 మే నెలకు పూర్తి చేశామని పేర్కొన్నారు. కృష్ణా నది నుంచి టన్నెల్‌కు వచ్చేటి నీటికి అప్రోచ్ ఛానల్ దగ్గర 80 వేల మెట్రిక్ టన్నులు మట్టిని తొలగించినట్లు చెప్పారు. నీరు వచ్చే మార్గాన్ని కూడా ఈ ఏడాదే ఏర్పాటు చేశామన్నారు. ఐదు కిలోమీటర్ల బెంచింగ్ టన్నెల్‌లో ఉండిపోతే, ఈ రెండేళ్లలో బెంచింగ్‌ను పూర్తి చేశామని చెప్పారు. టన్నెల్-2లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఏడు కిలోమీటర్లు, అంటే 7 వేల మీటర్ల లైనింగ్ మిగిలి ఉందని తెలిపారు. అతి ముఖ్యమైన ఫీడర్ కెనాల్ నడవడానికి వీలు లేని పరిస్థితిలో ఉండేదని, దాన్ని 21 కిలోమీటర్ల పొడవున్న రూ.460 కోట్ల నిధులు వెచ్చించి బాగు చేయించినట్లు చెప్పారు.








కామెంట్‌లు (0)