బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమా భూముల్లో ఎంఎస్ఎంఇ పార్కు వద్దు

9 గంటల క్రితం

మా భూముల్లో ఎంఎస్ఎంఇ పార్కు వద్దు
- తహశీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనుల బైఠాయింపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 09:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తహశీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనుల బైఠాయింపు

ప్రజాశక్తి - మార్టూరు (‌బాపట్ల జిల్లా) : పరిశ్రమల ఏర్పాటు పేరుతో తమ సాగు భూములను స్వాధీనం చేసుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ ‌చేస్తూ మంగళవారం బాపట్ల జిల్లా తహశీల్దార్ కార్యాలయం ఎదుట మార్టూరు మండలం నాగరాజుపల్లి తాండాకు చెందిన గిరిజన రైతులు ధర్నా చేశారు. ఉదయం నుంచి శాంతియుతంగా నిరసన కొనసాగించారు. మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన తహశీల్దార్ ప్రశాంతికి రైతులు వినతిపత్రం అందజేసి తమ భూములను కాపాడాలని కోరారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ మాట్లాడుతూ ‘మీ నుంచి 20 ఎకరాలు తీసుకుంటాం.. మీరు ఏమీ చేయలేరు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన గిరిజన రైతులు కార్యాలయం ఎదుటే బైఠాయించి నినాదాలు చేశారు. ఎంఎస్ఎంఇ పార్కు కోసం సాగు భూములను స్వాధీనం చేసుకునే చర్యలను నిరసిస్తూ రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ ‌గంగయ్య మాట్లాడారు. గిరిజన రైతులతో మండల మేజిస్ట్రేట్‌గా ఉన్న తహశీల్దార్ సంయమనంతో మాట్లాడాల్సి ఉండగా, వారిని ఆగ్రహానికి గురిచేసేలా మాట్లాడడం సరికాదన్నారు. మార్టూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గతంలో వందలాది గ్రానైట్ పరిశ్రమలు ఏర్పాటైనా, ప్రభుత్వ విధానాల కారణంగా అనేక పరిశ్రమలు మూతపడే పరిస్థితికి చేరాయని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో జాతీయ రహదారికి దూరంగా ఉన్న నాగరాజుపల్లి సమీపంలోని పచ్చని పంట పొలాలను ఎంఎస్ఎంఇ పార్కు కోసం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గిరిజన రైతుల భూములను కాకుండా వినియోగంలో లేని ఇతర భూములను పరిశ్రమల కోసం గుర్తించాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఎం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ధర్నాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు ఎనికపాటి రాంబాబు, బొడెంపూడి సూరిబాబు, గిరిజన సంఘం నాయకులు రమావత్ శ్రీనునాయక్, భూక్యా రంగనాయక్, భూక్యా బాలానాయక్‌తో పాటు పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్