గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజధాని అమరావతికి మా మద్దతు

2 గంటల క్రితం

CPI-Narayana-Clarity-
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వాన్‌పిక్ భూములను రైతులే సాగు చేసుకోవాలి : నారాయణ

ప్రజాశక్తి - చీరాల (బాపట్ల జిల్లా) : అమరావతి రాజధాని అంశంపై సిపిఐ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన చీరాల పర్యటనలో భాగంగా స్థానిక ఎఐటియుసి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. 1952 నుంచే గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతంలో రాజధాని ఉండాలని సిపిఐ కోరుతోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు పార్టీ స్వాగతించిందన్నారు. అనంతరం జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులను సిపిఐ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే దానిపై పోరాడతామని, రైతులకు అన్యాయం జరిగితే అండగా నిలుస్తామని, అయితే రాజధానిగా అమరావతిని వ్యతిరేకించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కఠిన చట్టాలను ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. విమర్శలు, మిమిక్రీ చేయడాన్ని దేశద్రోహంగా పరిగణించడం సరికాదని తెలిపారు. గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పోల్చుతూ, ఒకే రకమైన వ్యాఖ్యలపై వేర్వేరు ప్రమాణాలు అవలంభించడం తగదన్నారు. రావణ్‌‌పై నమోదైన ఉపా కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాన్‌పిక్ భూముల అసలు యజమానులు తమ భూములను స్వాధీనం చేసుకుని సాగు చేసుకోవాలని కోరారు. త్వరలో వాన్‌పిక్ భూముల సమస్యపై కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం మాజీ వాణిజ్య శాఖ మంత్రి జాగర్లమూడి లక్ష్మి పద్మావతిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిలో అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భక్తుల శామ్యూల్,మేడా వెంకట్రావ్, సిపిఐ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్