- మంత్రి లోకేస్ రాజీనామా చేయాల్సిందే
- వైసిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌సి–2025లో కుంభకోణం వాస్తవమని, దాన్ని త్వరలోనే బయటపెడతామని వైసిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని అన్నారు. డిఎస్‌సి స్కామ్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. అభ్యర్థులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలకు బదులివ్వని ప్రభుత్వం. అందుకు బదులుగా ఏవేవో డ్రామాలు. స్టేజ్ మేనేజ్ షో చేస్తోందని తెలిపారు. ఏ తప్పూ జరగనట్లు, అంతా బాగున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అన్ని వాస్తవాలు గుర్తించారని అన్నారు. అందుకే వైయస్సార్‌సీపీ చేపడుతున్న ఆందోళనకు విశేషంగా కదలి వస్తున్నారని, దిక్కు తోచని పరిస్థితిలో ప్రభుత్వం. ఉందని తెలిపారు. సెక్షన్–30, సెక్షన్–144 పేరుతో ర్యాలీ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులపై తీవ్ర నిర్భంధం ప్రయోగించారని, కుప్పం, పులివెందులలో పోలీసుల దౌర్జన్యం మితిమీరిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ధైర్యముంటే వైసిపి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. డీఎస్సీ–2025 రిక్రూట్‌మెంట్ కోసమే ప్రత్యేకంగా జీఓలు ఎందుకు జారీ చేశారో చెప్పాలన్నారు. వాటిల్లో నిజాయితీ ఉంటే రిక్రూట్‌మెంట్ పూర్తయిన తరువాత వాటిని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా, వ్యక్తిగతంగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎందుకు పిలిచారో చెప్పాలన్నారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత ఒకరికే ఎలా అప్పగించారో ప్రజలకు వివరించాలన్నారు. పరీక్షలో టాపర్‌గా నిల్చిన వ్యక్తి వివరాలను వెబ్‌సైట్ నుంచి ఎందుకు తొలగించారు ? స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ల అక్రమ వ్యవహారం బయటపడగానే, వాటిని ట్యాంపర్ చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయకపోతే సిబిఐతో దర్యాప్తు జరిపించాలన్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.








కామెంట్‌లు (0)