ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజధాని అసైన్డ్ భూముల తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతాం

19 జులై, 2026

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 07:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వైయస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అసైన్డ్ భూముల తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని వైయస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు.

చంద్రబాబు కేసుల్లో ఆధారాలు మారలేదని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే రూ.4,400 కోట్ల కుంభకోణమని అన్నారు. మాజీ మంత్రి నారాయణ ఆడియో రికార్డులపై దర్యాప్తు తొక్కిపెట్టారని, ప్రభుత్వం మారగానే పీపీలు నిందితులకు అనుకూలంగా మారిపోయారని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై తాము ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నామని వెల్లడించారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా, నాటి ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు హడావుడిగా ఏపీకి వచ్చారని తెలిపారు. తమకు కావలసిన వ్యక్తులకు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే లీకులు ఇచ్చి, ఆ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అసైన్డ్ రైతుల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో తీవ్ర భయాందోళనలు సృష్టించారని పేర్కొన్నారు. నిరుపేదల నుంచి తక్కువ ధరలకే అసైన్డ్ భూములను బలవంతంగా, మోసపూరితంగా బినామీల పేర్లతో లాక్కున్నారని అన్నారు. రాష్ట్రఅసైన్డ్ ల్యాండ్ చట్టం ప్రకారం అసైన్డ్ భూములను కొనడం, అమ్మడం పూర్తిగా నిషిద్ధమని చట్టాలు మొత్తుకుంటున్నా, చంద్రబాబు ప్రభుత్వం తన బినామీల ప్రయోజనాల కోసం 2016 ఫిబ్రవరి 17న "జీఓ ఎంఎస్ నంబర్ 41"ని అడ్డగోలుగా తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భూములు కొన్న బినామీలకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించడమే ఈ జీఓ ముఖ్య ఉద్దేశమని అన్నారు. నాటి ఏజీ (అడ్వకేట్ జనరల్) ఆమోదం లేకుండా, అసెంబ్లీలో ఎలాంటి చర్చ పెట్టకుండా నిబంధనలను తుంగలో తొక్కి ఈ జీఓను జారీ చేశారని, దీనిపై అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతోనే సిఐడి దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ కేసు కేవలం రాజకీయ ఆరోపణ కాదని చెప్పడానికి సిఐడి సేకరించిన సాక్ష్యాలే నిదర్శనమని, చంద్రబాబు, నారాయణలపై స్టే ఉన్నప్పటికీ, సిఐడి అధికారులు నిరుపేద అసైన్డ్ రైతులు, మధ్యవర్తులు, అధికారులు సహా మొత్తం 76 మంది సాక్షులను విచారించిందని చెప్పారు. 2024 మార్చి నాటి సిఐడి ప్రాథమిక విచారణ ప్రకారం సుమారు 1,100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగింది. దీని విలువ సుమారు రూ.4,400 కోట్లు ఉంటుందని అన్నారు. నారాయణ విద్యాసంస్థల నుంచి రూ.18.1 కోట్లు రామకృష్ణ మరియు ఇతర రియల్ ఎస్టేట్ మధ్యవర్తుల ద్వారా రూట్ మారి అసైన్డ్ రైతులకు చేరినట్లు పక్కా బ్యాంక్ లావాదేవీల ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఉద్దండరాయునిపాలెంకు చెందిన ఎస్సీ మాదిగ కులానికి చెందిన పులి సుధాకర్ వంటి బాధితుల భూముల కొనుగోలు సొమ్ము ఎలా బినామీల ద్వారా చేతులు మారిందో సిఐడి ఆధారాలతో సహా నిరూపించిందని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్