ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన సీపీఎం నాయకులపై పోలీసులు, కూటమి నాయకులు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం, ప్రశ్నించే నాయకులపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. శుక్రవారం ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. ఆంజనేయులు నాయక్‌పై క్రోసూరు ఎస్ఐ రవిబాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడి, కుడిచేయి విరగడంతో ఆయన సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం శ్రీనివాసరావు ఆయనను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన సీపీఎం నాయకులు, కార్యకర్తలపై దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. దాడిని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం ఉండాలని, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో పాల్గొనాలనుకునే నాయకులపై దాడులు జరగడం, వారు గాయపడి ఆసుపత్రుల పాలవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంజనేయులు నాయక్‌పై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి. కృష్ణయ్య, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే సహించేది లేదు : వి. శ్రీనివాసరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 04:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)