కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం
బాధితులకు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, నగదు
ముమ్మిడివరం నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సిఎం
ప్రజాశక్తి -అమలాపురం : అర్నబ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.4,600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పూర్తిస్థాయి నష్టం అంచనా అనంతరం ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు శుక్రవారం కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తు ప్రణాళిక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధికార యంత్రాంగం సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించామన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గచ్చకాయలపొరలో తుపాను ప్రభావిత ప్రాంతాలను గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తుపాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించామని చెప్పారు. నష్ట పరిశీలనకు శుక్రవారం కేంద్ర బృందాను పంపిస్తామని, అన్ని విధాలా సహకరిస్తామని అమిత్‌షా భరోసా ఇచ్చినట్లు వివరించారు.
కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులకు పరిహారం
తుపాను ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ.1,500, ఆయిల్ పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని సంబంధిత శాఖల అధికారులతో అంచనా వేయించి, అర్హులైన రైతులకు పరిహారం మొత్తాన్ని త్వరితగతిన జమ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో అర్హత గల బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకుల ప్యాకెట్‌తో పాటు ఖర్చుల నిమిత్తం నగదు సాయం అందించనున్నట్లు వెల్లడించారు.
ముందస్తు జాగ్రత్తతో ప్రాణనష్టాన్ని తగ్గించాం
శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించామని, జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి సహాయక చర్యలను సమన్వయం చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన సూచనలు ఇచ్చామన్నారు. గత తుపాన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సిబ్బందిని పంపుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు ఉన్నారు.








కామెంట్లు (0)