నమత ప్రతినిధులతో జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వాహన యజమానులకు వైసిపి అండగా ఉంటుందని, అసెంబ్లీ, పార్లమెంట్‌లో వారి సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని రవాణా రంగ ప్రతినిధులకు వైసిపి అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ (నమత) ప్రతినిధులు తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో జగన్‌ను బుధవారం కలిశారు. వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి వినతిపత్రం అందజేశారు. నెక్ట్స్ జనరేషన్ వాహన్ (పరివాహన్) వ్యవస్థ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2024లో చట్టబద్ధంగా వాహనాలు కొనుగోలు చేసిన కొత్త యజమానులు, 2018 నుంచి పూర్వ యజమానుల కాలంలో నమోదైన కేసులు, పెండింగ్ చలానాలు, బ్లాక్‌లిస్ట్‌ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వాహనం కొనుగోలు చేసిన కొత్త యజమానులకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పాత యజమానుల కేసులు, బకాయిలను చెల్లించాలంటూ రవాణాశాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాహనాల బదిలీ, పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇతర రవాణాశాఖ సేవలు నిలిచిపోతున్నాయని జగన్‌కు వివరించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల పేరుతో వాహన యజమానులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నారని పేర్కొన్నారు. జిల్లాకు ఒకే ఎటిఎస్ కేంద్రం ఉండటంతో వాహనాలను సూదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ఇంధనం, టోల్ ఛార్జీలు, డ్రైవర్ ఖర్చులు, వాహనం నిలిచిపోయే రోజుల కారణంగా అదనపు నష్టం కలుగుతోందని వివరించారు. ఎటిఎస్ కేంద్రాల వద్ద ఏజెంట్ల ప్రమేయంతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందేందుకు అధికారిక రుసుములతోపాటు ఇతర ఖర్చులు కలిపి ఒక్కో వాహన యజమాని సుమారు రూ.20 వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో అదనపు ఎటిఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. వాహన యజమానులపై అన్యాయమైన ఆర్థిక భారం తొలగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి పార్టీ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి శేషగిరి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు.








కామెంట్‌లు (0)