- ఎఎన్‌యు విశ్రాంత ఉప కులపతి ప్రొఫెసర్ సి.వి.రాఘవులు
- ‘పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ ది మహాభారత’ పుస్తకావిష్కరణ
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : మన చరిత్ర సంప్రదాయాల వాస్తవిక లక్షణ లక్ష్యాలను తెలుసుకునేందుకు మహాభారతాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఉప కులపతి ప్రొఫెసర్ సి.వి. రాఘవులు అన్నారు. మహాభారతం మన ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి మూల గ్రంథమన్నారు. ప్రొఫెసర్ కాట్రగడ్డ వెంకటేశ్వర్లు (కేవీ) రచించిన ‘పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ ది మహాభారత’ (మహాభారత రాజకీయ తత్వం) పుస్తకాన్ని ఆయన బుధవారం విజయవాడ ఎంజి రోడ్డులోని హోటల్ మినర్వా గ్రాండ్‌లోలో ఆవిష్కరించారు. ‘దారి దీపం’ సంపాదకులు డి.వి.వి.ఎస్. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాఘవులు మాట్లాడుతూ... మన సంప్రదాయ నాగరికతలో ఎన్నో దోషాలున్నాయని, దుష్ట సంప్రదాయాలను, ఆచారాలను, మూఢ విశ్వాసాలను తిరస్కరించడానికి, సంస్కరించడానికి సంబంధించిన అనేక అంశాలు మహాభారతంలో ఉన్నాయన్నారు. మహాభారతంలో గల కట్టుకథలను విస్మరించి శ్రద్ధగా, విమర్శనాత్మక దృష్టితో మన సంప్రదాయాన్ని తెలుసుకునేందుకు, సంప్రదాయ సంస్కృతిని సంస్కరించడానికి మహా భారతాన్ని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ‘మహాభారతంలో రెండు సూత్రాలను అనుసరించాలని కెవి సూచించారని, మొదటిది భారతీయత–భారతదేశ నాగరికత, రెండోది దేశచరిత్ర–సంస్కృతి అని అన్నారు. వీటి రూపురేఖలను, లక్షణాలను, ఆశయాలను ఆవిష్కరించడమే గ్రంథం ఉద్దేశమన్నారు. కథలు, గాధలు, పురాతన వృత్తాంతాలు, ఆఖ్యానాలు, దివ్యాస్త్రాలు తదితర అభూత కల్పనలు గ్రంథ లక్ష్యాలకు పరిపోషకాలన్నారు. పూర్వ శాస్ర్తకారులు వీటికి ఆపాదించిన పవిత్రతను సత్యార్థాలను ఆధునిక కాలంలో ఆమోదించాల్సిన అవసరం లేదన్నారు. మార్క్స్ చెప్పినట్లు వీటిని మనోహరమైన మాసనికానుభూతిని ఇచ్చే సాహిత్యంగా అధ్యయనం చేయొచ్చన్నారు. చరిత్ర, తత్వశాస్త్ర విశ్లేషకులు టి.రవిచంద్ మాట్లాడుతూ... పరిశోధనలో తనకు ముఖ్యంగా వైదిక సంప్రదాయం–బౌద్ధ ధర్మాల మధ్య సంబంధాన్ని సంభాషణాత్మక దృష్టితో చూడటం. భారతీయ ఆలోచనా చరిత్రలో భిన్నమైన భావజాలాలు పరస్పరం ఎలా ప్రభావితం చేసుకున్నాయో పరిశీలించడానికి దోహదం చేసే అంశాలు కనిపించాయమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కెవి మార్క్సిజాన్ని అధ్యయనం చేయడంతోపాటు ఆచరణలో కూడా ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలిచారన్నారు. సిద్ధాంతాలను ఆచరణలో పెట్టేవారన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ... విద్యార్థి ఉద్యమాలకు కెవి బాసటగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ గడ్డం కోటేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపల్ ఎస్. మనోరమ, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు మాట్లాడారు. కాట్రగడ్డ రజనీకాంత్, సామాజిక రాజకీయ విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ, సీనియర్ సిటిజన్ నాయకులు మోతుకూరి వెంకటేశ్వరరావు, అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)