- పంటలను పరిశీలించిన సిపిఎం కరువు బృందం
ప్రజాశక్తి - పలమనేరు రూరల్ (గంగవరం) గూడూరు టౌన్ (నెల్లూరు జిల్లా) : చెరువులు ఎండిపోవడంతో అందులోని మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తరలిస్తున్నారని, అధికారులకు తెలిపినా ఏ మాత్రం చలించడం లేదని పలమనేరుకు చెందిన రైతు సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. బోరుల్లో నీరు లేక పంట చేతికందే సమయంలో టమాటా పంట ఎండిపోయిందని గంగవరం మండలం మరుమాకులపల్లి గ్రామ రైతు తన గోడును కరువు బృందం ఎదుట వెళ్లబోసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో సిపిఎం కరువు బృందం గురువారం పర్యటించింది. చిత్తూరు పర్యటనలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, జిల్లా కన్వీనర్ వాడ గంగరాజు, జిల్లా నాయకులు ఓబుల్ రాజు, గిరిధర్ గుప్తా, పాకాల సుబ్రమణ్యం, శ్రీరాములు ఉన్నారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో మూడు బృందాలు రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయని, ప్రత్యక్షంగా చూసిన వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించేందుకు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. పలమనేరు ప్రాంతంలో పెసరగుంట కొత్తచెరువులో నీరు లేక పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. ఈ చెరువు ఆయకట్టు పరిధిలో 200 ఎకరాలు రైతులు సాగు చేసుకునే వారని, ఇప్పుడు పూర్తిగా 200 ఎకరాలు బీడుగా మారిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బోర్లు నమ్ముకుని కొద్దిగా పంటలు వేసినా అవి చాలక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వేరుశనగ పంట వర్షాధారపంట. వర్షాలు పడతాయని ఆశతో కొంతమంది పంట వేస్తే కొన్నిచోట్ల భూముల్లోనే విత్తనాలు వుండిపోయిన పరిస్థితి. గంగరాజు మాట్లాడుతూ వర్షాలు లేక 30 సంవత్సరాలు సర్వీస్ వున్న మామిడి చెట్లు కూడా ఎండిపోతున్నాయని తెలిపారు. కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి ఆ ప్రస్తావన తేకపోవడం దారుణమన్నారు. అక్టోబర్ నెలలో కరువు మండలాలు ప్రకటిస్తామని చెప్పడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడానికి రూ.50 కోట్లు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరుకు రూ.20 కోట్లు నిధులు కేటాయించాలి : సిపిఎం
నెల్లూరు జిల్లాలో పొదలకూరు, రాపూరు, సైదాపురం మండలాల్లో సిపిఎం కరువు బృందం పర్యటించింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బొప్పాయి చెట్లు వైరస్ సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నిమ్మ రేట్లు పడిపోయాయని, కండలేరులో చాలినన్ని నీళ్లు లేవని వాపోయారు. నిత్యావసర వస్తువులు రేషన్ డిపోల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా సహాయక చర్యల్లో భాగంగా రూ.20 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)