సంద్రాన్ని తలపిస్తున్న పంట పొలాలు
నిండా మునిగిన రైతన్న
ప్రజాశక్తి - కవిటి: తీవ్ర వాయుగుండం ఉద్దానం రైతాంగాన్ని చిగురుటాకులా వణికించింది. ఒకవైపు ఈదురుగాలులు, మరో వైపు భారీ వర్షంతో జన జీవనాన్ని స్తంభింపజేసింది. మండలంలోని పంట పొలాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 14 గ్రామాల్లో 986 ఎకరాల పంట ముంపులో ఉన్నట్టు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే ఈ సంఖ్య రెండింతలు ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. మరో వైపు వ్యవసాయ శాఖ అధికారి పిరియా శ్రీదేవి తన సిబ్బందితో క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.
నేల కొరిగిన కొబ్బరి, జీడి
గురువారం మధ్యాహ్నం నుంచి వీస్తున్న ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి, జీడి చెట్లు వేళ్లతో సహా బయటకువచ్చి నేలమట్టమయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం కవిటి మండలంలో 405 మంది రైతులకు చెందిన 713 కొబ్బరి చెట్లు నేలనేలకొరిగాయి. కంచిలి మండలంలో 205 మంది రైతులకు చెందిన 309 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. వీటి సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్యాన శాఖ అధికారి మాధవీ లత క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం నమోదు చేస్తున్నారు.












కామెంట్‌లు (0)