రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత
రూ.7.75 కోట్లతో నిర్మించిన ఐదు అగ్నిమాపక కేంద్రాలు ప్రారంభం
ప్రజాశక్తి- విజయనగరం కోట : ఫైర్ మెన్ లకు అత్యాధునిక శిక్షణను ఇవ్వడమే కాకుండా అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలను, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్, అత్యాధునిక ఫైర్ పరికరాల పనితీరును పరిశీలించారు. వాటి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పూసపాటిరేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచే ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను కూడా ఇక్కడి నుంచే_ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అగ్నిమాపక శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. విపత్తుల సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీస్, ఫైర్ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఐఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని పని చేసే విధంగా ఆధునిక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఫైర్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నివారణకు సిబ్బందికి తగిన ఆధునిక శిక్షణ ఇచ్చి ప్రత్యేక విభాగం ఏర్పాటుకు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు ఆర్ వి ఎస్ కెకె రంగారావు, లోకం నాగ మాధవి, పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ డిజి పివి.రమణ, ఎడి జి.శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక అధికారి పివి రాజేష్, ఎడిఎఫ్ఒ సోమేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)