-గదబపాలెంలో పివిటిజిల వినూత్న నిరసన
- గిరిజనుల భూములను ప్రభుత్వ గయాలుగా నమోదు
-ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించని అధికారులు
- తక్షణమే వెబ్ల్యాండ్లో నమోదుకు డిమాండ్
ప్రజాశక్తి- రావికమతం (అనకాపల్లి జిల్లా) : డి-పట్టా భూములను, రీ సర్వేలో ప్రభుత్వ గయాలుగా నమోదు చేసిన భూములను మార్పు చేసి వెబ్ ల్యాండ్లో రైతుల పేరిట నమోదు చేయాలని కోరుతూ అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కోట్నాబల్లి రెవెన్యూ గదబపాలెం గ్రామంలో అల్లూరి విగ్రహం వద్ద ఆదివాసి గిరిజనులు వినూత్న రీతిలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు మాట్లాడుతూ కొట్లాబిల్లి రెవెన్యూ పరిధిలోని రామన్న దొరపాలెంలో12, గదభపాలెంలో 30 కుటుంబాల పివిటిజి గదబ తెగల ఆదివాసి గిరిజనులకు 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం డి-పట్టాలు మంజూరు చేసిందని, వారు అప్పటి నుంచి జీడి, మామిడి తోట సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇటీవల నిర్వహించిన రీసర్వేలో పట్టాదారుల పేరు కాకుండా ప్రభుత్వ గయాలుగా నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద గిరిజన రైతులకు భూములకు దక్కకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. దీనిపై రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూ మొరపెట్టుకున్నా, ఆయా భూములను ప్రభుత్వం ఫ్రీజ్ చేసినందున తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారని, ప్రభుత్వం ప్రీహోల్డ్ నుంచి తొలగిస్తేనే నిబంధనల మేరకు తామేమైనా చేయగలమని అధికారులు అంటున్నారని తెలిపారు. రైతుల సాగు, అధీనంలో భూములు ఉన్నప్పటికీ, వారిపై యాజమాన్య హక్కు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆదివాసీ గిరిజన రైతులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే ఆయా భూములను గయాలుగా పేర్కొని ప్రీజ్ చేయడం ద్వారా గిరిజనుల నుంచి తిరిగి లాక్కోవాలని చూస్తోందని గోవిందరావు అనుమానం వ్యక్తం చేశారు. ఎస్టి కమిషన్ మాజీ చైర్మన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారన్నారు. ఈ మేరకు రావికమతం తహశీల్దారు కార్యాలయం నుండి సర్వేయర్, విఆర్ఒ సంయుక్తంగా భూములపై సర్వే చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)