ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ప్రముఖ శాస్త్రవేత్త, హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, పద్మ విభూషణ్ గ్రహీత ప్రొఫెసర్ పల్లె రామారావు (89) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు భార్య రేఖ, కుమారుడు నరేంద్ర, కుమార్తె సుమన్ ఉన్నారు. మెటలర్జీ, అణు భౌతిక శాస్త్రం, మెటీరియల్ సైన్స్ రంగాల్లో ఆయన విశేష కృషి చేశారు. 1937 జూన్ 30న కర్నూలులో జన్మించిన రామారావు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా సేవలందించారు. డిఎంఆర్‌ఎల్ డైరెక్టర్‌గా, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్‌గా పలు కీలక పదవుల్లో పనిచేశారు.
రామారావు మృతి పట్ల కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ జాతీయ చైర్మన్ వి కృష్ణ మోహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి రామారావు చేసిన సేవలు అపూర్వమని, ఆయన మృతి శాస్త్ర, సాంకేతిక రంగాలకు తీరని లోటని పేర్కొన్నారు. రామారావు మృతితో ఓ మార్గదర్శకుడిని కోల్పోయిందని జన విజ్ఞాన వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ (ఎఐపిఎస్‌ఎన్) ఆయనకు శ్రద్ధాంజలి ఘటించింది. విజ్ఞాన శాస్త్రం, పరిశోధన, దేశ సేవకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.








కామెంట్‌లు (0)