పల్నాడు జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల కోసం ప్రతిపాదనలు : కలెక్టర్
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వృద్ధుల హక్కులు, సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యమిస్తుందని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వృద్ధులకు ఏరియా ఆసుపత్రి, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ స్థాయిలో ఫిజియోథెరపీ, జెరియాట్రిక్ కేర్ సేవలను విస్తరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వినికిడి పరికరాలు, వాకింగ్ స్టిక్స్, వీల్‌చైర్లు అందిస్తున్నామన్నారు. వృద్ధాశ్రమాల పెరుగుదలను తగ్గించేందుకు వృద్ధులను బాలల సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలతో అనుసంధానించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. తల్లిదండ్రుల ఆస్తులు రాయించుకుని వారిని పట్టించుకోని పిల్లలపై సీనియర్ సిటిజన్స్ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వృద్ధుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని, సీనియర్ సిటిజన్ గ్రూపులకు సామాజిక సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా నిధులు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో వృద్ధులను సన్మానించి సహాయక పరికరాలను అందజేశారు. ఇదిలా ఉండగా బాలల హక్కులు, సంక్షేమంపై లైన్ డిపార్టుమెంట్లు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు కేజీ వెంకట పద్మలత, జిల్లా రెవిన్యూ అధికారి అద్దయ్య హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతం...
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, ఎస్పీ జగదీశ్ అధహళ్లి, జేసీ సంజనా శ్రీహర్ష పాల్గొన్నారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు పోలీసు శాఖతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఎన్నికల సామగ్రి కొనుగోలుకు వర్క్‌ఆర్డర్లు జారీ చేశామని, తెలంగాణ నుంచి మూడు, నాలుగు రోజుల్లో బ్యాలెట్ బాక్సులు రానున్నాయని, బ్యాలెట్ పత్రాల ముద్రణకు మూడు రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్‌ను ఖరారు చేస్తామని వివరించారు. ఆర్వోలు, ఏఆర్వోలకు నిపుణులతో వారం రోజుల శిక్షణకు షెడ్యూల్ రూపొందించినట్లు చెప్పారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు అధికంగా ఉన్నందున భద్రతా సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఎన్నికలను కనీసం మూడు విడతల్లో నిర్వహించాలని ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి కోరారు.








కామెంట్‌లు (0)