అమరావతి : విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ పదవికి జరిగిన ఎన్నికలలో జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణా భారీ ఆధిక్యం దిశలో సాగుతున్నారు. రాత్రి ఒంటి గంట సమయానికి ఆయన తన సమీప ప్రత్యర్థి వైసిపికి చెందిన రాయన భాగ్యలక్ష్మీ కన్నా లక్షకు పైగా ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. దీంతో రాధా అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. వంగవీటి రాధా కు 2,15,099 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మికి 1,07,467 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎబి వెంకటేశ్వరరావుకు 10,335 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగు తోంది. రెండు దశాబ్దాల తర్వాత మేయర్ పదవికి జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నిక కావడంతో ఇక్కడి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టిడిపి కూటమి ఒప్పందంలో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, వైసిపి అభ్యర్థితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా రిటైర్డ్ ఐపిఎజ్ అధికారి ఎబి వెంకటేశ్వ రరావు బరిలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో విజయవాడ మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కడప, విజయనగరంలో టిడిపి గెలుపు
కడప, విజయనగరంమేయర్ పీఠాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ మేరకు ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రతిష్టాత్మకంగ సాగిన కడప కార్పొరేషన్ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి మట్లి సువర్ణ గెలుపొందారు. ఆమె తన సమీప వైసిపి అభ్యర్థి దీప్తిపై 65,588 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి సవర్ణ 1,31,615 ఓట్లు సాధించారు.
కడప కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో తెదేపా 58, భాజపా 4, జనసేన 2 చోట్ల, వైసిపి 2 చోట్ల విజయం సాధించాయి. విజయనగరం మేయర్ అభ్యర్థిగా టిడిపి తరపను బరిలో దిగిన అవనాపు భార్గవి విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై ఆమె 18,787 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 62 డివిజన్లలో తెదేపా 35, భాజపా 3, జనసేన 6 చోట్ల విజయం సాధించాయి. వైకాపా 16 చోట్ల, ఇతరులు 2 చోట్ల గెలిచాయి.








కామెంట్‌లు (0)