ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిహారం అందని రైతుల పరిస్థితి ఏమిటి?

03 ఆగస్టు, 2026

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- భోగాపురం విమానాశ్రయం పేరుతో రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు : సిపిఎం

ప్రజాశక్తి - విజయనగరం టౌన్ : భోగాపురం విమానాశ్రయం నిర్వాసిత రైతులకు పరిహారం ఇంకా అందలేదని, వారి పరిస్థితి ఏమిటని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయనగరంలోని ఎల్‌బిజి భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానాశ్రయం నిర్మించడానికి రైతులు భూములు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం 1,572 కోట్లు, జిఎంఆర్ యాజమాన్యం 3,200 కోట్లు సమకూర్చి విమానాశ్రయం నిర్మించారు తప్ప, కేంద్ర ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వలేదని, కేవలం విమానాశ్రయం అనుమతులు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మొత్తం టిడిపి కూటమి ప్రభుత్వం మోడీ భజనే చేసిందని విమర్శించారు. నేటికీ నిర్వాసిత రైతులను కోర్టుల చుట్టూ తిప్పుతూ పరిహారం పూర్తిగా చెల్లించలేదని అన్నారు. నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన కాలనీలలో కనీస సదుపాయాలు లేవన్నారు. ఈ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు వచ్చిందని గొప్పగా ప్రచారం చేస్తున్న టిడిపి కూటమి ప్రభుత్వం ఎర్ర బస్సు ఎవరికోసమో, ఎయిర్ బస్సు ఎవరికోసమో సమాధానం చెప్పాలన్నారు. విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయాన్ని మూసివేసి అక్కడ ఉద్యోగాలను ఊడగొట్టి భోగాపురం విమానాశ్రయంలో కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టడం ఎవరికోసమని ప్రశ్నించారు. మోడీ సభను విజయవంతం చేసేందుకు వేలాది బస్సులను కేటాయించి కోట్ల కొలది ప్రజాధనం ఖర్చు చేసి ఆర్భాటం చేయడం దేనికని ప్రశ్నించారు. రైతులు విమానాశ్రయానికి భూములు ఇస్తే అత్త సొమ్ము అల్లుడు ధారబోసినట్లు విమానాశ్రయానికి జిల్లా పేరు పెట్టకుండా విశాఖపట్నం జిల్లా పేరు తగిలించడం తగదన్నారు. అభివృద్ధిలో జిల్లాను ముందంజలో నిలిపే వారైతే జిల్లాలో పరిశ్రమలు మూతపడి 50 వేలకు మందికి పైగా వలసలు పోతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, టివి రమణ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్