శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాపాడేది..సాగునీటి ప్రాజెక్టులే...!

1 రోజు క్రితం

ch
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం...

- ఎల్‌నినో వేళ పంటల బీమా లబ్ది రైతులకు దక్కేలా చర్యలు

- ఎల్‌నినో ప్రభావంపై సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడేది సాగునీటి ప్రాజెక్టులేనని... అందుకే తాను వీటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో ఎల్‌నినో ప్రభావం.. తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి గురువారం దిశా నిర్దేశం చేశారు. ఎల్‌నినో వేళ రైతులకు అవగాహన కల్పించడంతోపాటు... ధరల పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్‌నినో కారణంగా పంటలు నష్టపోతే రైతులకు బీమా డబ్బులు వచ్చేలా చూడాలని, ఎట్టిపరిస్థితుల్లో రైతు నష్టపోకూడదని సూచించారు. తాను ఇకపై ప్రతి వారం ఎల్‌నినో ప్రభావంపై సమీక్షిస్తానని... క్షేత్ర స్థాయి పర్యటనలు ఈ అంశంపై చేపడతానని తెలిపారు. అలాగే మంత్రులు, అధికారులు, కలెక్టర్లు నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉంటూ రైతుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉందని, తాగునీటికి, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వర్షాధార పంటలను ప్రొత్సహించాలని, దీని ప్రభావంతో నీటి ఇబ్బందులే కాదు.. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందన్నారు. పంటలు సరిగా పండవు కాబట్టి... నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ధరలను అదుపులో పెట్టేలా మంత్రులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఓ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఏ పంటలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేయాలని, ఆ పంటలు వేసేలా రైతులను ప్రొత్సహించాలని చెప్పారు. అవసరమైతే ఆ మేరకు రైతులకు సదురు పంటలకు సంబంధించిన విత్తనాలను రాయితీపై సరఫరా చేయాలన్నారు. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. ‘రైతులకు ఏ రకమైన పంటలకు బీమా చేయించారో... తెలుసుకుని ఆ రకమైన పంటలు వేయించడం ద్వారా రైతులు బీమా మొత్తాలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఏయే పంటలకు బీమా చేసుకున్నారోననే అంశంపై జిల్లా కలెక్టర్లు స్పష్టమైన జాబితాలను సిద్దం చేసుకుని.. దానికి అనుగుణంగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఓ రకమైన పంటకు బీమా చెల్లించి... వేరే పంటలు వేస్తే బీమా వర్తించకుండా పోయే ప్రమాదం ఉందని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీటికి, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావం మీద ఇకపై ప్రతి వారం తాను సమీక్షిస్తానని, క్షేత్ర స్థాయికి వెళ్తానని, మంత్రులు, కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ క్షేత్ర స్థాయికి వెళ్లాలని సూచించారు. పట్టిసీమ 8,100 క్యూసెక్కుల నీరు డిశ్చార్జి ఉందని, ప్రకాశం బ్యారేజీకి 6,700 క్యూసెక్కులు వస్తోందన్నారు. ఈ సీజన్‌లో పట్టి సీమ నుంచి ఇప్పటి వరకూ 39.5 టీఎంసీల గోదావరి నీరు కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామన్నారు. ఈ నీటితోనే తీవ్రమైన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ డెల్టాలోని లక్షల ఎకరాల సాగును కాపాడగలిగామన్నారు. 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను 3 ఏళ్లలోగానే పూర్తి చేయాలని, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా కాలువను వేగంగా పూర్తి చేశామన్నారు. ఇదే స్పూర్తితో 36 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. గోదావరి కావేరి అనుసంధానంతో పాటు జేజేఎం ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. నిర్దేశిత గడువు కంటే నెల ముందే ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు, అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. కరవు నివారణ పనుల్లో భాగంగా షెడ్లు, పశువుల దాణాకు కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. సాధ్యమైనంత మేర చెరువులను నింపి తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్