సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవయోవృద్ధులకు డే కేర్‌ సెంటర్లు ఎక్కడ?

4 రోజుల క్రితం

NANAJI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పంతం నానాజి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వయోవృద్ధులకు డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతినిచ్చినా రాష్ట్రంలో ఒక్క డే కేర్ సెంటరూ ఏర్పాటు చేయలేదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజి తెలిపారు. శాసనసభ జీరో అవర్‌‌లో బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో వయోవృద్ధుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, ప్రస్తుత కుటుంబ పరిస్థితుల కారణంగా వయోవృద్ధులు అనేక సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాకినాడ రూరల్లో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, రెండు శాఖల మధ్య ఈ భూమి విషయంలో వివాదం నెలకొందని స్థానిక ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీథర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ వివాదాన్ని పరిష్కరించి ఆ భూముల్లో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల జిల్లాలోని 5 నియోజకవర్గాల్లోని ప్రజలకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఆర్‌‌టిసి డిపో ఉందని, రాజమండ్రి నుంచి విజయవాడ రాకపోకలు సాగించే బస్సులు వెళ్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు వైపు రాకపోకలు సాగించే అన్ని బస్సులూ ఆ బస్టాండ్‌‌లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

విశాఖపట్నంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో భవనాలు నిర్మించుకున్న వారికోసం 2018 జులై 24న జారీ చేసిన బిసిఎస్‌ ఉత్తర్వులు 243 అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. తరువాత ఇచ్చిన బిసిఎస్ ఉత్తర్వులపై అనేక కేసులు ఉన్నాయని, 243 ఉత్తర్వులనే అమలు చేయాలన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఉన్న రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కోరారు. అటవీశాఖ అనుమతులు తీసుకుని రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కురుపాంలో 12 పిహెచ్‌‌సిలలో రోగులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్లే తోయక జగదీశ్వరి కోరారు. అలాగే నియోజకవర్గంలోని వట్టిగడ్డ, గుమ్మడిగడ్డ ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని, తోటపల్లి లిఫ్ట్‌ను పూర్తి ‌చేయాలని కోరారు. తుని నియోజకవర్గం తొండంగి మండలంలోని 10 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారని, వీరికి ఫిషింగ్ హార్బర్, జెట్టి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే యలమన దివ్య తెలిపారు. తొండంగి మండలంలోని వెంటనే ఫిషింగ్ హార్బర్ లేదా జెట్టిని నిర్మించాలని కోరారు. విశాఖపట్నం ఫార్మాసిటీలో పరిశ్రమల మధ్యలో ఉన్న పాడి గ్రామ తరలింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ ‌సభ దృష్టికి తెచ్చారు. చుట్టూ ఫార్మా పరిశ్రమలు ఉండటంతో గ్రామస్తులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని తరలించడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలన్నారు. చీరాల నియోజకవర్గం పరిధిలో 5 ఎత్తిపోతల పథకాల ద్వారా 15 వేల ఎకరాలు సాగువుతుందన్నారు. వీటికి ఏళ్ల తరబడి మరమ్మతులు నిర్వహించడం లేదన్నారు. ఎపిఎస్‌‌డిసి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించిందని, ఆ ప్రతిపాదనలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్