గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదలకు పట్టాలు ఎందుకు ఇవ్వరు : సిపిఎం

4 రోజుల క్రితం

cpm chbr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయవాడ: కృష్ణా నదీ తీరాన విశ్రాంతి భవనాలు, నాయకుల గెస్ట్‌హౌస్‌లు, భవంతులకు అనుమతులిచ్చి.. కృష్ణా కరకట్టపై నివసిస్తున్న పేదల ఇళ్లకు మాత్రం పట్టాలు ఎందుకు ఇవ్వరని సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు ప్రశ్నించారు. ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కృష్ణా కరకట్ట ప్రాంత ఇళ్లకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని, ఇళ్లు లేని పేదలకు నగరంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలోని 17వ డివిజన్‌ కృష్ణలంక, తారకరామా నగర్లో ప్రచార పాదయాత్ర శనివారం జరిగింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్ భూములను, కాలువ కట్టలపై భూములను బహుళజాతి సంస్థలకు చౌకగా లీజులకు ఇస్తున్న ప్రభుత్వం, పేదలకు మాత్రం పట్టాలిచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండుళ్లు దాటినా నేటికీ హామీ నెరవేరలేదని విమర్శించారు. ప్రజలు, కమ్యూనిస్టులు, సిపిఎం పోరాట ఫలితంగా రిటైనింగ్‌ ‌వాల్‌ను నిర్మించారని అన్నారు. వరద ముంపు లేకపోయినా ఎండలకు పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తాటాకులు, రేకులు తొలగించి స్లాబు, పై కప్పులు వేసుకుంటామంటే కృష్ణా నది తీరాన అనుమతి కుదరదంటున్నారని, ఇది అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలుగా తాటాకులు, రేకుల షెడ్డులో ఎండలకు మాడిపొతున్నారన్నారు. కృష్ణా నది మధ్యలో ఉన్న భవాని ఐలాండ్ 130 ఎకరాల భూమిని కారు చౌకగా కార్పొరేట్లకు లీజుకు ఇస్తున్నారని విమర్శించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన పాత బస్టాండ్ స్థలాన్ని లూలూ కంపెనీకి కట్టబెట్టడానికి నిబంధనలు అడ్డురావా? అని ప్రశ్నించారు. పట్టాలు సాధించుకునేంత వరకు ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పి.కృష్ణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు తమ్మిన చంద్రశేఖర్, కోరాడ రమణ, స్థానిక నాయకులు వై.కృష్ణ, కోటిరెడ్డి, జి.కె.ప్రసాద్, ఆదామ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్