- రేపు కర్రల సమరం
- ఐదు చెక్ పోస్టులు, పది పోలీస్ పికెట్ల ఏర్పాటు
- వెయ్యి మందితో బందోబస్తు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : సంప్రదాయం ముసుగులో పాత కక్షలతో కర్రల దెబ్బలకు తలలు పగిలి ఆస్పతుల పాలై ప్రాణాలు కోల్పోవడం కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని కర్రల సమరం (బన్ని ఉత్సవం)లో పరిపాటిగా మారింది. పోలీసులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా చివరికి రింగు కర్రలు ఉత్సవంలో కరాళ నృత్యం చేస్తున్నాయి. దసరా సందర్భంగా బన్నీ ఉత్సవంలో కర్రల సమరం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది బుధవారం రాత్రి ఈ సమరం జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే 190 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 40 కార్డన్ సెర్చ్ ఆపరేషన్లలో 300 కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఐదు చెక్‌పోస్టులు, పది పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. 110 నైట్ విజన్ సిసి కెమెరాలు, 700 ఎల్‌ఇడి లైట్లు, పది డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా చేపట్టారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా అడిషనల్ ఎస్‌పిలు, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలతో సహా మొత్తం వెయ్యి మందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2023లో కర్రల సమరంలో ముగ్గురు మృతి చెందారు. వంద మందికిపైగా గాయాలయ్యాయి. 2024లో తొక్కిసలాటలో 70 మంది గాయపడ్డారు. 2025లో ఇద్దరు చనిపోయారు. సుమారు
వంద మందికి గాయాలయ్యాయి. గతంలోనూ పోలీసులు గట్టి చర్యలు చేపట్టినా తలలు పగలడం మాత్రం ఆగలేదు. గత అనుభవాల దృష్ట్యా ఈసారైనా రక్తపాతం ఆగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కర్రల సమరం జరుగుతుందిలా..
దసరా నేపథ్యంలో ఈ ఏడాది ఈ నెల 21న రాత్రి మాళ మల్లేశ్వరస్వామి, మాళమ్మ ఉత్సవ విగ్రహాలకు కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం కొండపై నుంచి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కిందకు తీసుకొస్తారు. ఈ సమయంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట తదితర గ్రామాల భక్తులు ఒక గ్రూపుగా, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి, నిట్రవట్టి, అరికెర తదితర గ్రామాల భక్తులు మరో గ్రూపుగా ఏర్పడి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మార్గంలో కర్రలతో తలపడుతుంటారు. విగ్రహాలను తమ గ్రామాల వైపు తీసుకెళ్లడం లేదా ఊరేగింపును కొంతసేపు అడ్డుకోవడం శుభసూచకమనే నమ్మకంతో ఈ పోటీ జరుగుతుంది. పొడవాటి కర్రలకు ఇనుప రింగులు అమర్చి, డప్పుల మోతలు, నినాదాల సమరంలో పాల్గొంటుంటారు.
ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. ఈ ఉత్సవం సంప్రదాయబద్ధమైన వేడుక. దీనిని కర్రలతో పరస్పరం దాడులు చేసుకునే కార్యక్రమంగా భావించకూడదు. హింసకు పాల్పడవద్దు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.
-విక్రాంత్ పాటిల్, కర్నూలు ఎస్‌పి









కామెంట్‌లు (0)