సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఖండన
రాంచీ : జార్ఖండ్‌లో నిరాహార దీక్ష చేపడుతున్న విద్యార్థి నేతపై పోలీసుల చర్యను కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మంగళవారం ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతోకు ఆయన సంఘీభావాన్ని ప్రకటించారు. ఆస్పత్రిలో ఉన్న విద్యార్థి నేత మహతోతో దీప్కే వీడియో కాల్‌లో మాట్లాడారని సిజెపి ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసుల చర్యకు ముందు మహతో తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని, లాఠీచార్జ్ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. పోలీసుల చర్యతో తీవ్రమైన ఛాతీ నొప్పి, అనేక గాయాల కారణంగా మహతోకు ఆక్సిజన్ సపోర్ట్ అందించాల్సి వచ్చిందని సిజెపి తెలిపింది. శాంతియుత నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులే లక్ష్యంగా పోలీసులు లాఠీచార్జ్‌కు పాల్పడ్డారంది. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ అయినా లేదా జార్ఖండ్ వీధులైనా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన ఇటువంటి తీవ్రమైన చర్యలు క్రూరమైనవి, అమానవీయమైనవి, ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి అని దీప్కే పేర్కొన్నారు. విద్యార్థుల కోసం తన ప్రాణాలను పణంగా పెడుతున్న దేవేంద్ర మహతో నిజమైన హీరో అని దీప్కే ప్రశంసించారు. ఆయనకు, ఆయన న్యాయబద్ధమైన పోరాటానికి సిజెపి అండగా నిలుస్తుందని అన్నారు. పోలీసు చర్యపై తక్షణమే స్వతంత్ర విచారణ జరపాలని, లాఠీఛార్జికి ఆదేశించిన అధికారులు సమాధానమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బెదిరింపులు, క్రూరమైన చర్యలతో విద్యార్థి, యువత ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు.
పోలీసుల చర్యను ఖండించిన రాహుల్ గాంధీ
నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఖండించారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై ఎటువంటి హింసనైనా తాము ఖండిస్తున్నామని ఢిల్లీలో మీడియాతో ఆయన పేర్కొన్నారు.
జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనకు కేజ్రీవాల్ మద్దతు
జార్ఖండ్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. జార్ఖండ్‌లో నిరసన చేపడుతున్న విద్యార్థుల డిమాండ్లకు తాను మద్దతు ఇస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులపై హింస ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జెపిఎస్‌సి), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సి ) పనితీరులో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని, పలు నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో విద్యార్థులు జులై 25 నుండి ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)