- మహిళా సంఘాల ఐక్యవేదిక ధర్నాలో డిమాండ్
ప్రజాశక్తి- విజయవాడ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను ఎలాంటి షరతులూ లేకుండా అమలు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ఆమోదించి మహిళలకు న్యాయం చేయాలని కోరారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన విజయవాడ లెనిన్ సెంటర్ లో ఆదివారం జరిగిన ధర్నాలో ఐద్వా రాష్ట్ర నాయకులు డి.రమాదేవి, మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.దుర్గాంబ, పిఒడబ్ల్యు రాష్ట్ర నాయకులు పద్మ మాట్లాడారు. చట్టసభల్లో రిజర్వేషన్ తో మహిళా సాధికారత సాధ్యమవు తుందన్నారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను ఎలాంటి షరతులూ లేకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. 2023లో 106వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్‌కు చట్టబద్ధత లభించిందని గుర్తు చేశారు. దీనిని అమలు చేయకుండా జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వాయిదా చేసి మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలు 14 శాతం కూడా లేరని తెలిపారు. మహిళల ప్రాతినిధ్యంలో మనదేశం 151వ స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీదేవి, ఐద్వా ఎన్‌టిఆర్ జిల్లా నాయకులు గాదె ఆదిలక్ష్మి, ఝాన్సీ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గ, బి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)