- నవంబర్ లో 3.5 లక్షల మందితో ఉద్యమం
- ఏపి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జేఏసీ రణభేరి సదస్సు హెచ్చరిక
గుంటూరు : గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూశామని, ఇకపై ప్రభుత్వంతో అమితుమి
తేల్చుకుంటామని ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం సమస్యలపై స్పందించకపోతే వచ్చే నవంబర్లో రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగులు అతి పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సులలో భాగంగా గుంటూరులో మొట్టమొదటి రణభేరి సదస్సు ఆదివారం గుంటూరులోని పి.ఎల్.రావు భవన్లో నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో గౌరవాధ్యక్షులు ఏ.వి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ళ పాలనలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏమీ లేదని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం రెండు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్న ఎం. టి. ఎస్ హక్కును రద్దు చేసి అన్యాయం చేశాయన్నారు. రూ.7 వేలు, రూ. 8వేలు వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులని చెబుతూ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని విమర్శించారు. ప్రశ్నిస్తాం అన్న పవన్ కళ్యాణ్ గొంతు అధికారంలోకి రాగానే మూగబోయిందని, రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన పరిస్థితులు ప్రభుత్వానికి కనపడట్లేదని, అంబానీ ఆదాని వంటి కార్పొరేట్ ల సేవల తరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలోని నాలుగు లక్షల స్కీం వర్కర్లకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్డ్ పరిశ్రమల లో పనిచేస్తున్న 50 లక్షల మంది కార్మికులకు వేతన సవరణ పెండింగ్లో ఉంటే దానిని పట్టించుకోవట్లేదు అన్నారు. ఆదర్శ యజమానిగా ఉండాల్సిన ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయిస్తూ శ్రమ దోపిడీలో ఆదర్శంగా ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను అమలు చేయట్లేదని విమర్శించారు. ఉత్తర భారతదేశంలోని ఒరిస్సా, హర్యానా, పంజాబ్, రాజస్తాన్ హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షల మందిని రెగ్యులర్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చేయట్లేదు అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్లో తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించిన అతి పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
జేఏసీ చైర్మన్ బి.కాంతారావు మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కనీస చర్చ కూడా జరగకపోవడం అన్యాయమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కీలకంగా పని చేస్తున్న తమను విస్మరించటం సరికాదన్నారు. తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎంపిటిఎస్ ఇస్తామని, సంక్షేమ పథకాలు ఇస్తామని, రెగ్యులర్ చేస్తామని చెప్పి... ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వాలు అనేకం మారుతున్న గాని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బ్రతుకుల్లో మార్పు రావట్లేదు అన్నారు. ప్రభుత్వానికి విన్నవించే రోజుల పోయాయని ఈ బానిస బ్రతుకులు భరించేది లేదని, ప్రభుత్వ స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు కూడా వెనుకడబమని హెచ్చరించారు. ఆప్కాస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మన హక్కులు అడుగుతుంటే ప్రభుత్వం ఉన్న హక్కులను తొలగిస్తుంది అన్నారు. పోరాటాల వేతనాల పెంపు, ఇతర కొన్ని సౌకర్యాలు సాధించుకో గలిగామని, రాబోయే కాలంలో క్రమబద్దీకరణ కోసం రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జేఏసీ సెక్రటరీ జనరల్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ప్రధాన ఉద్యోగ సంఘాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవట్లేదని, ఈ నేపథ్యంలో మనం ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు దయామణి, వివిధ శాఖల సంఘాల రాష్ట్ర నాయకులు రవి ప్రకాష్, అప్పారావు, కళ్యాణి, ఏడుకొండలు, స్వాతి, సదస్సు కన్వీనర్ వి. రమేష్ బాబు తదితరులు ప్రసంగించారు.








కామెంట్‌లు (0)