ప్రజాశక్తి-మాచర్ల (పల్నాడు జిల్లా) : పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఫారాలు సమర్పించేందుకు వచ్చిన చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలపై టిడిపి నాయకులు దాడులకు పాల్పడ్డారని వైసిపి నేతలు ఆరోపించారు. అభ్యర్థుల బిఫారాలను బలవంతంగా తీసుకుని చించి వేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక బస్టాండ్ కూడలిలో రాస్తారోకోకు దిగారు. మహిళలు అని కూడా చూడకుండా నడిరోడ్డుపై దాడులకు పాల్పడ్డా రని, తమను గృహ నిర్బంధం చేసి, పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను టిడిపి వారు అడ్డుకుంటున్నారని, నియోజకవర్గంలోని పలువురు సిఐలు, ఎస్‌ఐలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాస్తారోకో అనంతరం రామకృష్ణారెడ్డితో పోలీసులు చర్చించారు. 144 సెక్షన్ అమలులో ఉందని, పైగా గృహ నిర్బంధంలో ఉన్న కారణంగా ఆందోళనలు చేయకూడదని చెప్పి ఆయనను అక్కడి నుంచి పంపివేశారు.
బిఫారాలు చించేశారని వైసిపి రాస్తారోకో..
21 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026, 10:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)