మృతుడిది శ్రీకాకుళం జిల్లా
ప్రజాశక్తి - తాడేపల్లి (గుంటూరు జిల్లా) : కృష్ణా నదిలో స్నానానికి దిగిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామానికి చెందిన పోతిరెడ్డి మురళి (24) హైదరాబాద్‌లోని విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. స్నేహితుని సోదరికి నీట్ పరీక్ష కారణంగా శనివారం రాత్రి తమ ఊరు నుండి స్నేహితుడు, స్నేహితుడి సోదరితో కలిసి విజయవాడ వచ్చారు. ఆదివారం స్నేహితుడి సోదరి నీట్ పరీక్ష రాయడానికి వెళ్లగా ఆమె వచ్చేలోగా మురళీ తన స్నేహితుడితోకలిసి కనకదుర్గ గుడికి వెళ్లి అక్కడి నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లారు. కృష్ణానది నీటిలో స్నానం చేసేందుకు దిగిన క్రమంలో మురళి అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయారు. తన కళ్లముందే స్నేహితుడు కనిపించకుండా పోయేసరికి స్నేహితుడు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఈతగాళ్లు, మత్స్యకారులు వెంటనే నీటిలోకి దిగి గాలించినా ఫలితం లేకపోయింది. తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి సంఘటనా స్థలానికి వెళ్లి తన బృందంతో గాలించగా కొండవీటి వాగు లాకుల సమీపంలో మురళీ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మురళి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.








కామెంట్‌లు (0)