- డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభ లోగో ఆవిష్కరణలో నేతలు
ప్రజాశక్తి - నెల్లూరు : టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక అవేమీ నెరవేర్చకుండా మోసం చేస్తోందని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు యువత పోరాటాలతో సంసిద్ధమవ్వాలని డివైఎఫ్ఐ నేతలు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగనున్న 16వ రాష్ర్ట మహాసభ లోగోను డివైఎఫ్ఐ మాజీ నాయకులు మూలం రమేష్, ఆహ్వాన సంఘం నాయకులు చొప్పా రవీంద్ర బాబు, డివైఎఫ్ఐ మాజీ నాయకులు మూలం రమేష్ నగరంలోని శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు, రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడారు. యువజన ఉద్యమాల పురిటిగడ్డ అయిన సింహపురిలో డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభ జరగడం గొప్ప అవకాశమన్నారు. నిరుద్యోగ భృతి కోసం యువత పెద్ద ఎత్తున పోరాడాలని కోరారు. రాష్ట్రంలో రైతుల దగ్గర బలవంతంగా తీసుకున్న భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నిర్వాసితులను మోసం చేస్తున్నారన్నారు. ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామన్న మాట మరిచి, రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు గంజాయి నిర్మూలించడంలో టిడిపి కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గంజాయి ముఠాల వల్ల చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో మహాసభలో పలు సమస్యలపై తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఒకటో తేదీ సాయంత్రం మూడు గంటలకు విఆర్‌సి గ్రౌండ్ నుంచి భారీ యువజన ప్రదర్శన జరుగుతుందని యువతీయువకులు, పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు భాస్కర్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)