మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇబ్రహీంపట్నం స్టేషన్‌‌కు యూట్యూబర్‌ ‌నందన

1 గంట క్రితం

cr-20260908_c57d77240bde1286.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:26 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ద డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ

  • స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్లు, నగదు లావాదేవీలపై ఆరా

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం : ​లండన్ ఉద్యోగాలు, వీసా స్పాన్సర్‌షిప్‌ల పేరుతో పలువురిని మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రముఖ యూట్యూబర్ జాగర్లమూడి నందనను ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం సుదీర్ఘంగా విచారించారు. యుకె వీసా రెన్యువల్, ఉద్యోగాల పేరుతో మోసం కేసులకు సంబంధించి నందూస్‌ వరల్డ్‌ అలియాస్‌ రమానందన విచారణ ముగిసింది. సుమారు నాలుగు గంటలపాటు విచారణ కొనసాగింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డారంటూ బాధితుడు క్రాంతికుమార్ ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నందన, ఆమె భర్త మధుకర్‌‌తో పాటు అత్తమామలపై కేసు నమోదైంది. ఈ విషయం వెలుగులోకి రాగానే నందన దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఎపి పోలీసులు లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఒసి) జారీ చేశారు. ఈ క్రమంలో బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో స్వదేశానికి ఒంటరిగా బయలుదేరిన నందన సోమవారం శంషాబాద్‌లో దిగారు. ఆమె పాస్‌పోర్ట్, వీసా పత్రాలు తనిఖీ చేసిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సమాచారం ఇవ్వడంతో శంషాబాద్‌ ‌పోలీసులు ఎల్‌ఒసి ఆధారంగా సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. విచారణ నిమిత్తం ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు. ద డెస్టినీ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సంస్థ కార్యకలాపాలు, క్లైంట్ల వివరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌లో ‘నందూస్ వరల్డ్’కు ఉన్న ప్రజాదరణను ఉపయోగించుకుని విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ప్రచారం నిర్వహించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూకే ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో ‘అన్నే రమా నందన’ పేరుతో కొన్ని కంపెనీలు నమోదై ఉన్నట్లు గుర్తించి వాటి కార్యకలాపాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ​వాటిలో నందూస్ కేఫ్ లిమిటెడ్, నందూస్ కిచెన్ లిమిటెడ్, స్మైల్ హెల్త్‌కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి సంస్థల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విచారణకు నందన సహకరించడం లేదని తెలిసింది.

​లావాదేవీలతో సంబంధంలేదని చెప్పారు : సిఐ

పోలీసుల విచారణలో వీసా రెన్యువల్, ‘డెస్టినీ కన్సల్టెన్సీ’తో తనకెలాంటి సంబంధం లేదని, ఆ వ్యవహారమంతా తన భర్త మధుకరే చూసుకుంటారని రమానందన తెలిపినట్లు సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 16న రమానందనను మరోసారి విచారిస్తామని చెప్పారు. విచారణకు సహకరిస్తానని 15 రోజుల క్రితం విజయవాడ పోలీస్ కమిషనర్, డిసిపిలకు రమా నందన మెయిల్ చేశారు. లుక్ అవుట్ నోటీసు తీసేయాలని పోలీసులను మెయిల్‌లో ఆమె కోరగా ‌నోటీసులు ఉపసంహరించుకోవడం కుదరని, విచారణకు రావాలని చెప్పటంతో ఆమె హైదరాబాద్ వచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్