'చలో పంచదార్ల’లో వైసిపి నేతలు
ప్రజాశక్తి - రాంబిల్లి (అనకాపల్లి) : టిడిపి కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పంచదార్ల క్షేత్రం ఫణిగిరిపై అక్రమ గ్రావెల్ తవ్వకాలకు వ్యతిరేకంగా మంగళవారం వైసిపి ఆధ్వర్యాన ‘చలో పంచదార్ల’ కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బైకులు, కార్లతో ర్యాలీ చేపట్టారు. బొత్సతో పాటు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తదితరులు పంచదార్ల పుణ్యక్షేత్రం సమీపంలో వెంకటాపురం, హరిపురం వద్ద జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను పరిశీలించారు. గతంకంటే నీటి ప్రవాహం తగ్గినట్టు నాయకులు అభిప్రాయాని కొచ్చారు. అనంతరం వెంకటాపురంలో నిర్వహిం చిన సభలో బొత్స, కన్నబాబు, అమర్‌నాథ్ మాట్లాడుతూ పంచదార్ల ఉమాధర్మ లింగేశ్వరుని ఆలయ సమీపంలో పుణ్యధారలకు విఘాతం కలిగేలా తవ్వకాలు జరిగాయని తెలిపారు. దీంతో ధారలు బురదమయంగా మారాయని, ఇటువంటి చోట మైనింగ్‌కు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడేది చిన్న వ్యక్తులు కాదని ఎంపి రమేష్, సుందరపు విజయకుమార్‌లనుద్దేశించి ఆరోపించారు. పంచదార్ల కొండను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ జిఒ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ వాహనాలు పంచదార్ల కొండపై ఉంటే బుధవారం తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బివి.సత్యవతి, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం, ఎమ్మెల్సీ కె.రవి బాబు, జెడ్‌పి ఛైర్‌పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)