మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజాక్షేత్రంలో ఘోర పరాజయం తప్పదని వైసిపి ముందే గ్రహించిందని, కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకపోవడంతో తప్పుడు ఆరోపణలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు విమర్శించారు. నామినేషన్లు వేసేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారని, ఎన్ఓసీలు ఇవ్వడం లేదని కుంటిసాకులు చెబుతున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం కాబట్టే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా తన విధులు నిర్వర్తించగలుగుతోందని తెలిపారు. శాంతిభద్రతల సమస్య కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని నిర్ధారణ అయితే ఆ పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే నామినేషన్ల గడువును పొడిగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ పొడిగింపు, నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి 48 గంటలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసిందన్నారు. తుది జాబితా ప్రచురణను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారనే ఫిర్యాదులు అందితే సంబంధిత సాక్ష్యాధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. 2021 స్థానిక ఎన్నికల ప్రక్రియలో వైసిపి దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని తెలిపారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, 80 శాతం స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర వైసిపిదని ఆరోపించారు. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ని అక్రమంగా తొలగించిన తీరు, కోర్టు ద్వారా ఆయన తిరిగి నియమితులైన తర్వాత కూడా ఆయనపై చేసిన వ్యక్తిత్వ హననం ప్రజలు మరిచిపోలేదన్నారు.








కామెంట్లు (0)