బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెటర్నరీ కళాశాలపై మాట్లాడే నైతిక హక్కు వైసిపికి లేదు

57 నిమిషాల క్రితం

td
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 08:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గరివిడి వెటర్నరీ కళాశాలకు అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసిపికి లేదనివ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కళాశాల అభివృద్ధిని పట్టించుకోకుండా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రజలకు మెరుగైన పశువైద్య సేవలు అందించడంతో పాటు, ఈ ప్రాంతంలో వెటర్నరీ విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2016లో గరివిడిలో వెటర్నరీ కళాశాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. 2017 ఏప్రిల్‌లో రూ.81.72 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేశామని, 2018 ఫిబ్రవరిలో సుమారు 90 ఎకరాల భూమిని కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన ఐదేళ్ల సమయం అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేసిందని మంత్రి ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్క బోధనా పోస్టునైనా భర్తీ చేశారా ప్రశ్నించారు. 2024 ఆగస్టు నాటికి పూర్తికావాల్సిన నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో పూర్తి కాలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు కూడా ముందుకు సాగలేదని తెలిపారు. పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించిందని స్పష్టం చేశారు. గరివిడి వెటర్నరీ కళాశాలలో మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ప్రధాన లోపాలు లేవని తాజా వీసీఐ పరిశీలన స్పష్టం చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. విసిఐ జూలై 27, 28 తేదీల్లో కళాశాలను తనిఖీ చేసిందని, భవనాలు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. కళాశాలలో సిబ్బంది కొరతను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 253 బోధనా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి పొందామని మంత్రి తెలిపారు. ఇప్పటికే వీసీఐ సూచనల మేరకు కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించి మొత్తం బోధనా సిబ్బంది సంఖ్యను 77కు పెంచామని చెప్పారు. ఆరు నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసి విసిఐ అనుమతులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్