- ఎస్ఐపై దాడి కేసులో మరో తొమ్మిది మంది అరెస్టు కూడా
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, ఆమదాలవలస : మహిళా ఎస్ఐపై అసభ్యకరంగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో వైసిపి ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గత నెల 30న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా చింతాడ రవికుమార్ ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు భారీగా కొత్త రోడ్డు వద్దకు చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో బూర్జ ఎస్‌ఐ ప్రవళ్లికపై అసభ్యకరంగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించి చింతాడ రవికుమార్‌తో పాటు మొత్తం 21 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల అరెస్టు విషయంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో శనివారం అరెస్టులకు దిగారు. ఇదే క్రమంలో అదనంగా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరిని మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి శ్రీకాకుళంలోని ఫస్ట్ క్లాస్ మెజిస్ర్టేట్ ఇంటి వద్ద ప్రవేశపెట్టడంతో వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదే సమయంలో చింతాడ రవికుమార్ కూడా జడ్జి ఇంటి వద్ద లొంగిపోతారన్న ప్రచారం సాగింది. కొద్దిసేపటి తర్వాత శ్రీకాకుళం డిఎస్‌పి కార్యాలయంలో లొంగిపోతానంటూ సమాచారమిచ్చిన రవికుమార్‌ను కార్యాలయానికి వస్తున్న క్రమంలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెం దగ్గర పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఎక్కడికి తరలించారన్న విషయంపై పోలీసులు గోప్యంగా ఉంచారు.








కామెంట్‌లు (0)