జులై 1న దేశవ్యాప్తంగా ఆందోళనలు
ఆగస్టు 10న జైలు భరో
వ్యవసాయ కార్మిక, సంఘర్ష్ మోర్చా అఖిల భారత వేదిక నేతల పిలుపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పేదల ఉపాధి హామీకి ముప్పుగా మారిన కొత్త చట్టం వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గర్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (విబి గ్రామ్‌జి)ను జులై 1 నుంచి అమలు చేయొద్దని, పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కొత్త చట్టం అమలు చేసే రోజున దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ప్రతిఘటన చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక, సంఘర్ష్ మోర్చా అఖిల భారత వేదిక నేతలు తెలిపారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైలు భరో నిర్వహిస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విబి గ్రామ్ జిలోని నిబందనలు ఉన్న ఉపాధిని దూరం చేసేలా ఉందని విమర్శించారు. బుధవారం నాడిక్కడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.వెంకట్, గుల్జార్ సింగ్ గోరియా, నిఖిల్ దేవ్, ముఖేష్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం అమలుకు 55 క్లాజులు (పాయింట్స్), వందల సబ్ పాయింట్లతో విడుదల చేసిన డ్రాప్ట్ రూల్స్ అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
మొత్తం అధికారాలన్నీ స్టీరింగ్ కమిటీకి కట్ట బెట్టారని, కమిటీలో మొత్తం అధికార్లే ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాలకు, ఉపాధి కార్మికులకు ప్రాతినిధ్యం లేని అధికార కేంద్రంగా ఉందని విమర్శించారు. కౌన్సిల్‌కు ప్రతిపాదిందిన రూల్స్ చూస్తే పని హామీ ఉండదని, అధికారాలు లేకుండా రాష్ట్రాలు చివరికి ఉత్సవ విగ్రహాల వలే మిగిలిపోతాయని పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ ఎంత బడ్జెట్‌ను ప్రతిపాదిస్తే, కేంద్ర ప్రభుత్వం అంతమాత్రమే విడుదల చేస్తుందని విమర్శించారు. అదనంగా పైసా కూడా ఇవ్వరని, నిరుద్యోగ భృతి అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని రూల్స్‌లో స్పష్టంగా చెప్పారని తెలిపారు. డిమాండ్ బేస్ స్థానంలో కేంద్రం ఎంత ఇస్తే అంతమాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధి కార్మికులే కాదని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త చట్టం కింద కేంద్ర బడ్జెట్‌లో వివిధ రాష్ట్రాలకు కేటాయింపుల ప్రతిపాదన చేశారని, దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,707 కోట్లు, రాష్ట్రం 40 శాతం వాటా రూ.5,138 కోట్లు కలిపి మొత్తం రూ.12,845 కోట్లు ఈ ఏడాది అందుబాటులో ఉంటాయని అన్నారు. ఏపిలో 54.99 లక్షల జాబ్ కార్డు దారులు పనిచేస్తున్నారని, కార్డుదారులు దీనికి రెట్టింపు ఉన్నారని తెలిపారు. యాక్టివ్ కార్డుదారులకు ఈ మొత్తాన్ని వేతనాలుగా ఇస్తే కేవలం 71 పనిదినాలు మాత్రమే వస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా 125 పని దినాలు కల్పించాలంటే, రూ.22,746 కోట్లు కావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వదని అన్నారు. అంటే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కాకుండా మరో రూ.9,901 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ మొత్తం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇస్తారా? అని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలే 40 శాతం వాటా, అదనపు పని దినాలకు మొత్తం రూ.24,000 కోట్ల నిధులు కేటాయించాల్సి వస్తోందని, ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు.
మోడీ ప్రభుత్వం ఉపాధిపై ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో గత ఐదు నెలల ఉపాధి అనుభవం చెబుతోందని అన్నారు. 2025 జనవరి నుండి మే వరకూ దేశవ్యాప్తంగా 128.1 కోట్ల పని దినాలు కల్పిస్తే, కొత్త చట్టం ఆమోదించిన తరువాత 2026 జనవరి నుండి మే వరకు 79.1 కోట్ల పనిదినాలకు పడిపోయాయని తెలిపారు. 40.8 కోట్ల (35 శాతం పైగా) పని దినాలు తగ్గాయని పేర్కొన్నారు. చట్టం అమలు కాకముందు పరిస్థితే ఇలా ఉంటే జూలై 1 నుండి చట్టాన్ని అమలు చేస్తే ఇంకా పని దినాలు ఎలా కుదిస్తారో స్పష్టం అవుతుందని అన్నారు. ఈ కొత్త చట్టం రద్దు చేసి, పాత చట్టాన్ని పునరుద్దరించే వరకు పోరాటం కొనసాగుతోందని, ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.









కామెంట్‌లు (0)