mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిప్పుల కొలిమి

21 మే, 2026

summer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 21, 2026, 08:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణొగ్రత • ఈ సీజన్‌‌లో అత్యధికం

• 11 జిల్లాలో 45 డిగ్రీల కన్నా ఎక్కువ • 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఎండలు • వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి • మరో నాలుగు రోజులు ఇదే స్థితి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారుతోంది. సూర్య ప్రతాపంతో బుధవారం ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎండల తీవ్రతతో ఉదయం పది గంటలకే అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్‌‌లోనే అత్యధికం కావడం గమనార్హం. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో ఎండలు 43 డిగ్రీలను దాటాయి. పల్నాడు జిల్లాలో 23 మండలాలు, కృష్ణాలో 21, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో 20 మండలాల చొప్పున, బాపట్లలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్‌, గుంటూరులో 15 మండలాల చొప్పున, మార్కాపురం జిల్లాలో 12 మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పిడుగురాళ్లతోపాటు కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.1 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీలు, బాపట్ల జిల్లా కొల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 45.7 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొండపిలో 45.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 45.5 డిగ్రీలు, నెల్లూరు జిల్లా గూడూరులో 45.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన వడగాల్పుల తీవ్రత రాత్రి పది గంటల వరకు కూడా కొనసాగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రివేళల్లోనూ ఉక్కపోత తగ్గలేదు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ, డీహైడ్రేషన్‌, అలసట, తలనొప్పి వంటి సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో మరో నాలుగు రోజులు ఇదే తీవ్రత లేదా ఇంతకన్నా ఎక్కువ తీవ్రతలో ఎండలుంటాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రఖర్‌‌జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

​నేడు.. రేపు ఇలా!
గురువారం కోస్తాధ్రలోని పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం మరింత తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరించింది. శుక్రవారం కూడా కోస్తా జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, నెల్లూరు వరకు వేడి ప్రభావం విస్తరించే సూచనలు ఉన్నాయని పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం 74 మండలాల్లో తీవ్రంగానూ, 232 మండలల్లో ఒక మోస్తరుగాను వడగాల్పులు వీస్తాయని, శుక్రవారం 24 మండలాల్లో తీవ్రంగానూ, 270 మండలాల్లో ఒక మోస్తరుగాను వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్‌ ఉన్నవారు ఎండలో తిరగరాదని తెలిపింది.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్