ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో భానుడి భగభగలు ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం నాడు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడే గురువారం 47.6 డిగ్రీల ఉష్ణొగ్రత నమోదు కాగా, దానిని ఈ సీజన్‌లో అత్యధికమని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. గురువారం 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఇదే మాదిరి కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు అల్లూరి సీతారామరాజు, పోలవరం, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, 15 మండలాల్లో తీవ్ర వడ గాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శనివారం పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది.
పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు
22 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 22, 2026, 07:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)