ఒకవైపు క్రౌన్ ( కిరీటం).. మరోవైపు బుగ్గ మీసాల చెఫ్.. మధ్యలో కాఫీ రంగు బ్యాక్ గ్రౌండ్ పై వెండి రంగు కోడిగుడ్ల ఆకారం అక్షరాలు.. ఇంగ్లీషులో పెద్దగా.. ఏషియన్ ఎగ్ బోండా.. దిగువ బ్రాకెట్లో చిన్న అక్షరాలతో తెలుగు, హిందీలో!
భీమిలి రాజుగారు, విజయనగరం బుస్సీ నాయుడు పార్టనర్స్ గా కొత్త వ్యాపారం.. ప్రారంభోత్సవ కార్యక్రమం. కార్పొరేట్ దర్పం అడుగడుగునా! ఎన్ వి హోటల్ అనుభవం రాజు గారిదీ.. కోళ్ల ఫారాల అనుభవం బుస్సీనాయుడిది. లోపల గుడ్డు ఆకారం టేబుళ్లు, చైర్స్.. అడుగడుగునా ఎగ్ కల్చర్ కనిపిస్తోంది. కసింకోట సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో వేద పండితులు, మంగళ వాయిద్యాల బృందంతో దశమంతు నాయుడు, ఆ వెంట పరదేశి వచ్చారు.
వేదికపై పౌల్ట్రీ రంగ పితామహులు బి.వి. రావు గారి చిత్రపటానికి ముఖ్య అతిథి నారాయణమూర్తి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది. స్వాగత ఉపన్యాసం రాజు గారిది--
" అందరికీ నమస్కారమండి. బ్రహ్మాండమైన కోడికూరల హోటల్ ఉండగా, రాజుగారేంటి.. గుడ్డు బిజినెస్ లోకి వచ్చేసారు. కోడి ముందా! గుడ్డు ముందా!! అన్నట్టుగా మా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన తర్వాత, నా కలలకు కూడా రెక్కలొచ్చేసేయండీ! ఏదో పేపర్ లో జిఎంఆర్ గారి జీవిత చరిత్ర చదివాను. ఆయన్ని ఫాలో అయిపోవాలని డిసైడ్ అయ్యాను. ట్రెండ్ బట్టి బిజినెస్.. ఇదే జిఎంఆర్ సూత్రం. జూట్ మిల్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ, దాన్ని అమ్మేసి బీర్ ఫ్యాక్టరీ.. దాన్ని కూడా బ్యాంకు రుణాలు ఎగ్కొట్టేసి లండన్ ఉడాయించక ముందు, కింగ్ ఫిషర్ మాల్యాకు అమ్మేసి.. బ్యాంకు, ఇన్సూరెన్స్.. అవి కూడా అమ్మేసి, హైవేల మీదుగా ఎయిర్ పోర్ట్ దగ్గరికి చేరిపోయారు. ఉత్తరాంధ్ర మాటకు ఏం గానీ, రాజాం షావుకారు దేశ దేశాల రాజధానుల స్థాయికి ఎదిగి పోవడం రికార్డే కదండీ! ఆయన్ని ఫాలో అయిపోవాలని భోగాపురం సంబరం తర్వాత మేము నిర్ణయించుకున్నాం. ( కొంచెం సేపు ఆగి ) నాకన్నా, మా బుస్సీ నాయుడు ఇంకా బాగా చెప్పగలడండీ!"--నవ్వుతూ, మరొక్కసారి నమస్కరిస్తూ వేదిక దిగిపోయారు రాజుగారు.
" మా రాజు గారి చమత్కారం మీకు తెలియంది ఏముంది? ( నవ్వి .. కొంచెం సీరియస్ మూడ్లోకి వచ్చి ) 1950లో ఏడాదికి దేశంలో ఒక మనిషికి, ఐదు గుడ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. మన తెలుగువాడైనా బి.వి. రావు గారి కృషి వల్ల, ఇప్పుడు మనిషికి 106 గుడ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏడాదికి 365 రోజులు అని మర్చిపోకండి. ఇవాళ, గుడ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే టాప్. ప్రపంచంలో మాత్రం మన దేశం సెకండ్..."-- ఆయన మాటలు పూర్తికాకముందే..
" అండము నుంచే పిండము.. పిండము నుంచే బ్రహ్మాండము అని ఏనాడో మన సనాతన మహర్షులు చెప్పేశారు"- వేదిక ఎదురుగా, ముందు వరుసలో కూర్చున్న సిద్ధాంతి మంచి సపోర్టు మాటే అందించారు." రండి.. సిద్ధాంతి గారు.. మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. తమరు వచ్చి మాట్లాడండి"--వినయంగా ఆహ్వానించాడు బుస్సీ.
" లోకాః సమస్తు సుఖినోభవంతు.. సాక్షాత్తు అమెరికా శాస్త్రవేత్తలే శాఖాహారమని నిర్ధారించేశారు. ఇంకా,
మీమాంస దేనికండీ? మీమాంసలో మాంసం ఉందని, శాస్త్రం చదవడం మానేశాడట వెనకటికొకడు! ( నవ్వి ) రాసింది మనమే అయినా, అమెరికా వాడు చెప్పిందే వేదం కదండీ మనకు! ( మళ్లీ నవ్వు ) "-- మద్దతుగా చప్పట్లు బాగానే పలికాయి. ముఖ్య అతిథి నారాయణ మూర్తి లేచి--
" అందరికీ నమస్కారం.. మిత్రులకు శుభాకాంక్షలు "-- మీటి వదిలేసిన వీణ తీగెలాగా ఆయన గొంతు సన్నగా వణికింది. " ఈమధ్య మా విజయవాడలో, వైసిపి వాళ్ళు దీక్ష చేస్తుంటే, టిడిపి వాళ్లు కొందరు గుడ్లు విసరడం చాలా బాధనిపించింది "- ఆయన మాటలు పూర్తికాకుండానే..
" బ్రాహ్మణుల మీద కోడిగుడ్లు విసరడమంటే.. ఆ పవిత్ర శిరస్సుల మీద చితగ్గొట్టడమంటే.. బ్రహ్మ హత్యతో సమానం.. పాతకం!"--సిద్ధాంతి కోపంతో, సభ మర్యాద పాటించలేకపోయారు.
" అయినా, విజయవాడ దీక్షల సంగతి తెలియందేముంది? ఇక్కడ కోడిగుడ్ల దాడి, అంత తీవ్రమైనదేమీ కాదు. కాకపోతే, మా రాజూ, బుస్సీ.. సిద్ధాంతి గారి స్పీచులు విన్న తర్వాత, మనసు బాధనిపించింది. గుడ్లను దుర్వినియోగం చేశారే! గౌరవం లేకుండా పోయిందే! అని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆ బాధ ఎక్కువైంది."
" మేమందరం.. మీతో ఉంటాం కదండీ! నిజంగానే, ఈ బిజినెస్ కు ' ఎగ్ బోండా ' అని పేరు పెట్టారేమో! అని నేను కూడా అనుకున్నాను "-- దశమంతు నాయుడు బయటపడ్డాడు. సభలో గుసగుసలు.. ముఖాలు చూసుకోవడాలు..నిజం..
నిజమే అనుకోవడాలు.. గమనించి," అర్జెంటుగా పేరు మార్చేయండి మూర్తి గారూ!"--రాజుగారు చేతులు జోడించి అభ్యర్థించారు. మూర్తి కొద్దిసేపు ఆలోచించి.. నవ్వుతూ..
" మీ ఇద్దరి పేర్ల (నాయుడు, రాజు) లోనే రెండు అక్షరాలు మంచివి ఉన్నాయి. అవి పెడదాం" అన్నారు.
- ' నల్లి ' కుట్టు








కామెంట్‌లు (0)