ప్రజాశక్తి- నకరికల్లు (పల్నాడు జిల్లా)
చిన్నపాటి వివాదంలో స్టేషన్‌కు పిలిపించి పోలీసులు మానసికంగా వేధించడం, చేయిచేసుకోవడంతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుని కుటుంబసభ్యుల, స్థానికుల కథనం ప్రకారం... నకరికల్లు గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు కేసరి సూర్యనారాయణ రెడ్డి (62)కు, ఆయన ఇంటి పక్కనేగల కొణతం కొండారెడ్డి దంపతులకు మంచినీటి పైపుల విషయంలో గత రెండు సంవత్సరాల నుంచి వివాదం ఉంది. కొండారెడ్డి ఫిర్యాదు మేరకు సూర్యనారాయణ రెడ్డిపై నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కొండారెడ్డికి టిడిపి నాయకుల అందడండలు ఉండటంతో వారి ఒత్తిడి మేరకు పోలీసులు సూర్యనారాయణ రెడ్డిని గత నాలుగు రోజులుగా ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు స్టేషన్ లో కూర్చోబెట్టి మానసికంగా హింసించారని, అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు స్టేషన్లో కానిస్టేబుల్ చేయి చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి, చల్లగుండ్ల గోరంట్ల మేజర్ పక్కనున్న పొలాల్లో పురుగుల పురుగుల మందు తాగి సూర్యనారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకొని నిరసన తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, మృతుని భార్య కేసరి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు నిందితులు కొండారెడ్డిపైనా, ఆయన భార్యపైనా, టిడిపి నాయకుడు డీకొండ మహానందిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. సూర్యనారాయణ రెడ్డిపై కానిస్టేబుల్ చేయిచేసుకున్నారన్న ఫిర్యాదుపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.









కామెంట్‌లు (0)