– సూర్యలంక, విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్
– ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తీర ప్రాంత పర్యాటకాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు పేరుతో ప్రభుత్వం బీచ్ షాక్ బార్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రానికి 975 కిలోమీటర్లకు పైగా సముద్ర తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో, తీర పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బీచ్ షాక్ బార్ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతుంది. 2016లో టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అమల్లోకి నోచుకోలేదు. బీచ్‌లో బార్లు ఏర్పాటు చేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతాయని, బీచ్‌లలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని, కుటుంబ సమేతంగా బీచ్‌లకు వెళ్లేందుకు అవకాశం ఉందనే వాధనలు మహిళా, ప్రజా సంఘాల నుంచి గతంలో వ్యక్తం అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త మార్గదర్శకాలతో ఈ విధానాన్ని పునరుద్ధరించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా తొలి దశలో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ లో 2, విశాఖపట్నం బీచ్‌లలో 2 చొప్పున మొత్తం 4 బీచ్ షాక్ బార్లకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏపీ ఎక్సైజ్ (బార్ లైసెన్సుల మంజూరు మరియు లైసెన్సు నిబంధనలు) రూల్స్–2025లో సవరణలు చేస్తూ ప్రభుత్వం జిఒ 363ను జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన బీచ్ షాక్ బార్ పాలసీ (జి.ఓ.ఎంఎస్ నెం.362) అమలుకు వీలుగా ఈ సవరణలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 975 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని పర్యాటకాభివృద్ధికి వినియోగించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒక సంవత్సరం తర్వాత ఫలితాలను సమీక్షించి ఇతర తీర ప్రాంతాలకు విస్తరించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. స్టార్ హోటళ్లు, టూరిజం రిసార్టులు, పర్యాటక శాఖలో నమోదైన సంస్థలు, సొంత బీచ్ భూమి కలిగిన వారు లేదా ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేటాయించిన భూమి పొందిన వారు మాత్రమే బీచ్ షాక్ బార్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీచ్ షాక్ ఇలా ఉండాలి
బీచ్‌లో 1,000 నుండి 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం ప్రదేశం, పర్యావరణ హిత, తాత్కాలిక నిర్మాణం అవసరం, మహిళలు, పురుషులకు వేర్వేరు మరుగుదొడ్లు, పూర్తి భోజన సదుపాయం కలిగిన కిచెన్, తగిన పార్కింగ్ సదుపాయం, డెక్ బెడ్లు, గొడుగులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండాల్సి ఉంటుంది. మద్యం విక్రయాలు: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, ఆహార సేవలు మాత్రం స్థానిక అనుమతుల మేరకు మరింత సమయం కొనసాగించవచ్చుని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సదుపాయం, ఫైర్ సేఫ్టీ పరికరాలు, తగిన లైటింగ్, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.
బీచ్ షాక్ బార్లలో కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం కలిగిన పానీయాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. బీర్ (మైల్డ్, క్రాఫ్ట్ బీర్ సహా) వైన్, రెడీ టు డ్రింక్ పానీయాలకు మాత్రమే విక్రయాలకు అవకాశం కల్పిస్తారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, విస్కీ, బ్రాండీ, రమ్, వోడ్కా వంటి మద్యం విక్రయాలకు అనుమతి ఉండదు. అలాగే బీచ్ ప్రాంతాల్లో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు అనుమతించిన డెసిబెల్ పరిమితిని మించి లౌడ్ స్పీకర్లు, భారీ సంగీత కార్యక్రమాలకు అనుమతి ఉండదు.
లైసెన్సు ఫీజులు
ప్రాథమిక అనుమతి కోసం తిగిరి చెల్లించబడని దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు చెల్లించాలి, లైసెన్సు దరఖాస్తు ఫీజు రూ.10 వేలు, మొదటి సంవత్సరం రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూ.7.50 లక్షలు, ప్రతి ఏటా ఇది 10 శాతం చొప్పున పెరుగుతుంది. బీచ్ షాక్ బార్ లైసెన్సు 2026 సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు 31 వరకు మూడు ఏళ్ల కాలానికి చెల్లుబాటు అవుతుంది. బార్ లైసెన్సు పొందే ముందు, ఎపిటిడిసి సిఫార్సు, కోస్టర్ రెగ్యులేషన్ జోన్ (సిఆర్‌జడ్) అనుమతి, ట్రేడ్ లైసెన్సు, ఫ్యాస్సి లైసెన్స్, ఫైర్ సేఫ్టి సర్టిఫికెట్ వంటి అన్ని అనుమతులు పొందాలి.









కామెంట్‌లు (0)