అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర పారిశ్రామిక ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, ప్రమాదానికి కారణమైన అంశాలను ప్రజల ముందు ఉంచాలని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించడంతోపాటు కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, గాయపడిన కార్మికులకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించి వారి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరించాలని కోరింది. విశాఖలోని పౌర గ్రంథాలయంలో మంగళవారం అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలను ఆమోదించారు. జెఎసి చైర్మన్ ఎం.జగ్గునాయుడు, వైస్ చైర్మన్ ఎం.మన్మధరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కార్మిక, ప్రజా, రైతు, మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన పది మంది కార్మికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ప్రమాణాల అమలు, ప్రభుత్వాల బాధ్యత, స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
యుపిఎస్సి మాజీ సభ్యులు, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్.చలం మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన సంఘటనగా చూడలేమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాలు, యాజమాన్యం భద్రతా ప్రమాణాల అమలుపై చూపుతున్న నిర్లక్ష్యం, సిబ్బంది కొరత, యంత్రాల నిర్వహణలో లోపాలు వంటి అనేక కారణాలు ఈ ప్రమాదానికి దారితీశాయని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు గతంలోనే పలుమార్లు భద్రతా లోపాలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడంతో పాటు అన్ని విభాగాల్లో సమగ్ర భద్రతా తనిఖీలు నిర్వహించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రమాదంలో పదిమంది కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని, వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కార్మిక సంఘాల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన అనంతరం యాజమాన్యం ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటివరకు తమ నివేదికలను ప్రజల ముందుకు తీసుకురాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్‌లో నాణ్యత లేని ముడిసరుకుల వినియోగం, ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత, భద్రతా నిబంధనల అమలులో నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ విధానాల వల్ల కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో మిగిలిన సిబ్బందిపై అధిక పనిభారం పడుతోందని, ఇది పరిశ్రమల్లో ప్రమాదాల అవకాశాలను పెంచుతోందన్నారు.
భద్రతా ప్రమాణాలను పూర్తిగా అమలు చేయకుండా ఉత్పత్తి లక్ష్యాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌లో కాలం చెల్లిన యంత్రాలను ఇంకా వినియోగిస్తున్నారని, వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని పేర్కొన్నారు. భద్రతా ఆడిట్లు క్రమం తప్పకుండా నిర్వహించడం లేదని, అనేక విభాగాల్లో భద్రతా పరికరాలు సరిపడా అందుబాటులో లేవని విమర్శించారు. కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.









కామెంట్‌లు (0)