శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అదానీ నిబంధనల ఉల్లంఘన

1 గంట క్రితం

Pinarayi Vijayan calls for scrapping NTA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 12:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కేరళం మాజీ సిఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం

- విజింజం పోర్టు వాటాల బదిలీపై సెబీకి ఫిర్యాదు

- విచారణ జరపాలని డిమాండ్‌

​ కన్నూర్ : కేరళలోని విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయ ప్రాజెక్టులో అదానీ గ్రూప్ ప్రతిపాదించిన 49 శాతం వాటాల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సెబీ, స్టాక్ ఎక్స్చేంజీలకు ఆ రాష్ర్ట ప్రతిపక్ష నేత, మాజీ సిఎం పినరయి విజయన్ లేఖ రాశారు. అదానీ విజింజం పోర్ట్ ప్రయివేటు లిమిటెడ్ (ఎవిపిపిఎల్‌)లోని 49 శాతం వాటాను సుమారు 1.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,300 కోట్లు)కు మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ (ఎంఎస్‌‌సి) కొనుగోలు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్ ప్రకటించిన నేపథ్యంలో విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ​కన్సెషన్ ఒప్పందంలోని క్లాజ్ 5.3.1 ప్రకారం 25 శాతానికి మించిన వాటాల బదిలీ లేదా యాజమాన్య మార్పునకు రాష్ర్ట ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని విజయన్ పేర్కొన్నారు. అయితే అదానీ గ్రూప్ సెబీకి సమాచారం ఇచ్చిన్నప్పటికీ కేరళ ప్రభుత్వానికి తెలియజేయకుండా, అనుమతి పొందకుండా ఈ ప్రక్రియను కొనసాగించడం ఒప్పంద ఉల్లంఘనే అవుతుందన్నారు. ఇది ప్రజా ప్రయోజనాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ​ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్ నుంచి వివరణ కోరాలని డిమాండ్‌ ‌చేశారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని సెబీని కోరారు. జులై1న అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం వద్దకు ఎలాంటి అనుమతి దరఖాస్తు రాలేదని ముఖ్యమంత్రి వెల్లడించినప్పటికీ.. అనంతరం మీడియాలో వచ్చిన కథనాలు భిన్నంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

​ప్రజల సొమ్ముతో నిర్మితమైన విజింజం పోర్టు రాష్ట్రానికి అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని విజయన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించలేదని.. సెబీని ఆశ్రయించే కనీస చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వద్దే పోర్టులు, న్యాయ, ఆర్థిక శాఖలు ఉండటంతో ప్రభుత్వ పాత్రపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు.

​తన అభ్యంతరం ఎంఎస్‌‌సి సంస్థపై కాదని విజయన్ స్పష్టం చేశారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన ఎంఎస్‌‌సి విజింజం పోర్టులో గణనీయమైన వాటా సొంతం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో గుత్తాధిపత్య ధోరణి పెరిగి పోటీ తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల పెట్టుబడులు, పోర్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్