- వైరల్ వీడియోపై విచారణ
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్–మౌ రైల్వే మార్గంలో ఓ లోకో పైలట్ సమోసా కొనుగోలు చేయడానికి ప్రయాణికులతో వెళ్తున్న రైలును పట్టాలపై నిలిపివేయడం కలకలం రేపింది. రైల్వే గేటు సమీపంలోని దుకాణంలో సమోసాలు కొనుగోలు చేసి తిరిగి రైలులోకి ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. పట్టాల పక్కన ఉన్న దుకాణంలో లోకో పైలట్ సమోసాలు కొనుగోలు చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. వీడియో వైరల్ కావడంతో రైల్వే భద్రతా ప్రమాణాలపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలును వ్యక్తిగత అవసరాల కోసం ఆపడం జరిగితే అది తీవ్రమైన భద్రతా ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు.
అయితే, సంబంధిత సిగ్నల్ పాయింట్ వద్ద సాధారణంగా రైళ్లు వేగాన్ని తగ్గిస్తాయని అధికారులు తెలిపారు. సమోసా కొనుగోలు కోసమే రైలును పూర్తిగా నిలిపారా? లేదా ఇతర ఆపరేషనల్ కారణాల వల్ల రైలు ఆగిందా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. లోకో పైలట్ నిర్లక్ష్యం చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)