- 16వ రోజూ కొనసాగిన ఆందోళన
- 8 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష
- ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి జెఎన్‌యు నేత తరలింపు
- ఆందోళనలో మాజీ సైనికుడు రాజేష్ థాపా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ పరీక్ష పేపర్ లీక్, సిబిఎస్ఇ అవకతవకలకు బాధ‌్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన ఆందోళనకు అనూహ్య మద్దతు లభిస్తోంది. సిజెపి నిరసన 16వ రోజు, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఎనిమిది రోజు కొనసాగింది. ఇప్పటి వరకు సుమారు ఆరు కేజీల బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. రక్తంలో చక్కెర స్థాయి 46కు పడిపోవడంతో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) సంయుక్త కార్యదర్శి డానిష్ అలీని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి నేతలు నేహా, మనీష్, హృషికేష్, దీపక్ కుమార్ వర్మ, ఆమీన్ నిరసన ప్రదేశంలో తమ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించారు.
మా అమ్మాయి ఆత్మహత్యకు కేంద్రమే బాధ్యత వహించాలి
- మాజీ సైనికుడు రాజేష్ థాపా
తన కుమార్తె మరణానికి విద్యా వ్యవస్థ వైఫల్యమే కారణమని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ సైనికుడు రాజేష్ థాపా డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ తరువాత ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో రియాకుమారి థాపా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురైన రాజేష్ జంతర్ మంతర్ చేరుకుని, ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని, తమ కుటుంబం అనుభవిస్తున్న వేదన మరే తల్లిదండ్రులు అనుభవించకూడదని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. థాపా తల్లిదండ్రుల దుఃఖంలోనూ, వారి పోరాటంలోనూ వారికి అండగా నిలుస్తామని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)