- కోల్‌కతాలో బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోస్టుమార్టం నివేదిక వెల్లడి
- నిందితుడు బిజెపి నాయకుడు
కోల్‌కతా : కోల్‌కతాలో 11ఏళ్ళ బాలికపై శనివారం సామూహిక అత్యాచారం, హత్య జరిగిన కేసులో పోస్టుమార్గం నివేదిక సోమవారం వెలువడింది. బతికి వుండగానే ఆ బాధితురాలిని చెరువులోకి విసిరేసినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. ఆమె పొట్టలోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన నీరే ఇందుకు సాక్ష్యంగా వుంది. పైగా చెరువులోకి విసిరేసినపుడు ఆమె తల బలంగా నేలకు తగలడమో లేదా గట్టి వస్తువుకు కొట్టుకోవడమో జరిగిందని నివేదిక పేర్కొంది. విపరీతంగా రక్తస్రావం జరగడంతో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమె శరీరమంతటా కొరికిన గాట్లు వున్నాయని నివేదిక పేర్కొంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరౌపూర్‌లో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితురాలికి పుట్టినరోజు కానుక కొనేందుకు బయటకు వెళ్ళి ఆ బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దాంతో ఆమె కుటుంబం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆదివారం ఆమె మృత దేహాన్ని గోనెసంచీలో కుక్కి వుండగా చెరువులో కనుగొన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు బిజెపి నాయకుడు కావడంతో దర్యాప్తుపై కుటుంబ సబ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, సోమవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టు చేసిన వారిసంఖ్య మూడుకు చేరింది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు కీలక దశలో వుందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తాజాగా పోస్టుమార్టం నివేదిక కూడా రావడంతో అన్నింటినీ పరిశీలిస్తామని చెప్పారు. సిసిటివి ఫుటేజీని పోలీసులు పరిశీలించగా నలుగురు వ్యక్తులు బాలికను ఎత్తుకెళుతున్నట్లు కనిపించిందని తెలిపారు.








కామెంట్‌లు (0)